ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లే కీలకం : మోదీ

ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లే కీలకం : మోదీ
  •  ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్యాయం చేస్తున్నయ్ 
  • అందుకే ఈ అంశంపై నేను మాట్లాడుతున్నా  
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాను మైనార్టీలకు ఇవ్వాలని చూస్తున్నరు
  • ‘ఏఎన్ఐ’ ఇంటర్వ్యూలో ప్రధాని కామెంట్స్ 
  • రేపు కన్యాకుమారికి మోదీ.. 48 గంటలు ధ్యానం

న్యూఢిల్లీ: ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశమే కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అణగారిన వర్గాల హక్కులను, రాజ్యాంగ సూత్రాలను కాపాడేందుకే తాను ఈ అంశంపై మాట్లాడుతున్నానని చెప్పారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను చీకట్లలో ఉంచి ప్రతిపక్షాలు వారిని దోపిడీ చేస్తున్నాయి. అందుకే నేను ఆ వర్గాల వారిని అలర్ట్ చేస్తున్నా. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నాయని ప్రజలకు వివరిస్తున్నా” అని ఆయన అన్నారు. 

‘‘బీసీలు, దళితులు, గిరిజనులకు శ్రేయోభిలాషులమని చెప్పుకుంటున్నవాళ్లే  ఆ వర్గాల వారికి అతిపెద్ద శత్రువులు. అందుకే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కుల కోసం నేను పోరాడుతున్నా” అని మోదీ తెలిపారు. ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ప్రధాని అనేక అంశాలపై మాట్లాడారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. 

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీయే అతిపెద్ద శత్రువని, ఆ పార్టీ బారి నుంచి ఈ వర్గాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. అణగారిన వర్గాల హక్కులను రక్షించాల్సిన అవసరం ఏర్పడినందునే 2024 లోక్ సభ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశమే కీలకం అయిందన్నారు.  

కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి షాక్ అయ్యా 

కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి తాను షాక్ అయ్యానని మోదీ చెప్పారు. అందులో ముస్లింలీగ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కాంట్రాక్టుల్లో, స్పోర్ట్స్ లో సైతం మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తామనడం దారుణమన్నారు. పంజాబ్, బెంగాల్, యూపీ, తదితర రాష్ట్రాల యువత రకరకాల క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్నారని, ఇప్పుడు వారి కోటాను మైనార్టీలకు కట్టబెడతామంటే ఆ యువత భవిష్యత్తు ఏం కావాలని ప్రశ్నించారు. 

అలాగే ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనూ మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం కూడా ఘోర తప్పిదమన్నారు. ఉదాహరణకు ఏదైనా ఒక బ్రిడ్జి కట్టేందుకు సామర్థ్యం ఉన్న కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వాలి కానీ.. మతపరంగా రిజర్వేషన్లు తెచ్చి బ్రిడ్జి కట్టే పని అప్పగించడం ఏమిటన్నారు. ఒకవేళ ఆ బ్రిడ్జి కూలిపోయి జనం ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.

 ప్రతిపక్షాల హయాంలో విద్యా సంస్థలను మైనార్టీ సంస్థలుగా మారుస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లను దూరం చేశారని ప్రధాని ఫైర్ అయ్యారు. ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీని మైనార్టీ విద్యా సంస్థగా మార్చేయడంతో అందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అడ్మిషన్లు, ఉద్యోగాలకు దూరమయ్యారని చెప్పారు. రిజర్వేషన్లపై 50% ఉన్న పరిమితిని ఎత్తేయడానికి రాజ్యాంగ సవరణ తెస్తామని కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారని ప్రధాని తప్పుపట్టారు. 

ముస్లిం కోటాతో ఓబీసీలకు అన్యాయం 

ప్రతిపక్ష కూటమిలోని పార్టీలు ముస్లింలను ఓబీసీల్లో చేర్చుతూ ఆ వర్గాల వారికి అన్యాయం చేస్తున్నాయని మోదీ అన్నారు. వెస్ట్ బెంగాల్ లో పదేండ్లుగా ముస్లింలకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇవ్వడాన్ని కలకత్తా హైకోర్టు కూడా తప్పుపట్టి వాటిని రద్దు చేసిందన్నారు. కలకత్తా హైకోర్టు తీర్పును సైతం లెక్కచేయబోమని అక్కడి రూలింగ్ పార్టీ చెబుతుండటం దారుణమన్నారు. 

నాకు తిట్లు అంటవ్!

ప్రతిపక్షాలు తనను 24 ఏండ్లుగా దూషిస్తూనే ఉన్నాయని, వారి దూషణలను వినీ వినీ తాను చివరకు తిట్లు అంటని విధంగా(గాలీ ప్రూఫ్ గా) మారిపోయానని మోదీ చమత్కరించారు. ఇతరులను దూషించడం తమ హక్కు అని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాయని, అందుకే ఇప్పుడు దూషించడమే వాటి స్వభావంగా మారిపోయిందన్నారు.

 ‘‘నన్ను మౌత్ కా సౌదాగర్ (మృత్యు వ్యాపారి) అని, గందీ నాలీ కా కీడా (మురికి కాల్వలోని కీటకం) అని తిట్టారు. పార్లమెంట్ లో నన్ను తిట్టిన తిట్లంటిన్నింటినీ మా పార్టీ ఎంపీ ఒకరు లెక్కేస్తే.. అవి 101కి చేరాయి” అని మోదీ అన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో పదేండ్లలో ఈడీ కేవలం రూ. 34 లక్షలు జప్తు చేసిందని.. కానీ తమ హయాంలోని పదేండ్లలో ఈడీ రూ. 2,200 కోట్లు సీజ్ చేసిందన్నారు.

 ఇంత అద్భుతంగా పని చేసినందుకు ఈడీని మెచ్చుకోవాల్సింది పోయి దూషించడం ఏమిటన్నారు. ఎవరు జైలుకు వెళ్లాలన్నది ప్రధాని మోదీ డిసైడ్ చేస్తారన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కామెంట్ పై స్పందిస్తూ.. ప్రతిపక్ష నేతలు ముందుగా రాజ్యాంగాన్ని, చట్టాలను చదువుకోవాలని, అంతకంటే తాను ఇంకేమీ చెప్పలేనన్నారు.  

రేపు కన్యాకుమారికి మోదీ.. 48 గంటల ధ్యానం

ప్రధాని మోదీ గురువారం ఆధ్యాత్మిక యాత్ర నిమిత్తం తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లనున్నారు. అక్కడ సముద్రంలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ఆయన గురు, శుక్రవారాల్లో 48 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన చోటే ప్రస్తుతం మెమోరియల్ ఏర్పాటు చేశారు. కన్యాకుమారి పర్యటన తర్వాత మోదీ తిరిగి శుక్రవారం ఢిల్లీకి బయలుదేరనున్నారు. కాగా, లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనుండగా, మూడు రోజుల ముందు మోదీ ఇలా ఆధ్యాత్మిక యాత్ర చేపట్టనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఫలితాలకు ముందు ఆయన కేదార్ నాథ్ వెళ్లి గుహలో మెడిటేషన్ చేసి వచ్చారు.   

జార్ఖండ్​లోకి చొరబాట్లతో ట్రైబల్స్ సంఖ్య తగ్గుతోంది

దమ్ కా(జార్ఖండ్)/బరాసత్ (వెస్ట్ బెంగాల్): చొరబాట్లతో జార్ఖండ్​లోని  సంథాల్ పరగణా డివిజన్​లో గిరిజనుల జనాభా తగ్గిపోతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఇక్కడి జేఎంఎం కూటమి సర్కారు చొరబాటుదారులను ప్రోత్సహిస్తుండటంతో వారు గిరిజనుల భూమలు లాక్కుంటున్నారని అన్నారు. మంగళవారం జార్ఖండ్​లోని దమ్​కాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. 

లవ్ జిహాద్ అనే పదం జార్ఖండ్ ప్రజలే పెట్టారని, ఇక్కడ వీక్లీ హాలీడేను ఆదివారం నుంచి శుక్రవారానికి మార్చాలని కూడా ప్రభుత్వం భావిస్తోందన్నారు. మంగళవారం వెస్ట్ బెంగాల్ లోని బరాసత్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలోనూ మోదీ మాట్లాడారు. బెంగాల్ లోని టీఎంసీ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు, ఓట్ జిహాద్ కోసం ఓబీసీల హక్కులను దోపిడీ చేస్తోందని ఫైర్ అయ్యారు.