దివ్యాంగులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు : ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్

దివ్యాంగులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు : ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్

 హైదరాబాద్, వెలుగు : కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్​అన్నారు. లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 సీట్లు గెలుస్తామని  ఆయన ధీమా వ్యక్తం చేశారు. బుధవారం గాంధీ భవన్ లో కాంగ్రెస్​ పార్టీ అనుబంధ దివ్యాంగుల విభాగం చేపట్టిన  విజయ సంకల్ప యాత్ర ను మహేశ్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. 

ఈ యాత్రకు కాంగ్రెస్ పార్టీ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం సహకరించి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గెలుపు కోసం దివ్యాంగులు యాత్ర చేపట్టడం అభినందనీయమని ఆయన అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే చత్తీస్ గఢ్​రాష్ట్రం మాదిరిగా లోకల్ బాడీల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, దివ్యాంగుల చట్టాన్ని అమలు చేస్తామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

 బ్రెయిలీ స్క్రిప్ట్, సైన్ లాంగ్వేజ్ ను ప్రత్యేక భాషగా గుర్తిస్తామన్నారు. దివ్యాంగుల విభాగం స్టేట్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ.. దివ్యాంగులను బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్​ను పెంచుతామని ఆయన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం దివ్యాంగుల నిధులు ఖర్చు చేయలేదని, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు అమలు చేయలేదని ఆయన ఫైర్ అయ్యారు.