
మెదక్, వెలుగు: తెలంగాణ నూతన మద్యం పాలసీ (2025-–27)లో భాగంగా రిజర్వేషన్ ప్రకారం వైన్స్ షాప్ ల కేటాయింపు కోసం గురువారం కలెక్టరేట్ లో కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభివృద్ధి శాఖల అధికారుల సమక్షంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు డ్రా నిర్వహించారు. జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు ఉండగా వాటిలో గౌడ సామాజిక వర్గానికి 9, ఎస్సీకి 6, ఎస్టీకి 1 షాప్ లను కేటాయించారు.
లాటరీ విధానంలో ఎంపిక చేసి వాటి ఆమోదానికి రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ కు పంపిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. పూర్తి గెజిట్ శుక్రవారం వెలువరిస్తామని చెప్పారు. మిగతా 33 షాపులు ఓపెన్ క్యాటగిరిలో ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్, జిల్లా ఎస్టీ అభివృద్ధి అధికారి నీలిమ పాల్గొన్నారు.
అభియాన్ వైద్య శిబిరాల ద్వారా మెరుగైన వైద్యసేవలు
టేక్మాల్: స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం ఆయన టేక్మాల్ పీహెచ్సీ, మోడల్ స్కూల్, కేజీబీవీని తనిఖీ చేశారు. పీహెచ్సీలో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరంలో పిల్లల వైద్య నిపుణులు, ఇతర స్పెషలిస్టు డాక్టర్లు అందుబాటులో ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు.
శిబిరాల గురించి ముందుగానే అన్ని గ్రామాల్లో ప్రచారం చేయాలని ఆదేశించారు. మొబిలైజేషన్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి శిబిరాలకు తరలించాలన్నారు. మెరుగైన ఆరోగ్య సేవలు అవసరం ఉన్న వారిని ప్రభుత్వ జనరల్ ఆస్ప్రతికి రిఫర్ చేయాలన్నారు. అనంతరం మోడల్ స్కూల్, కస్తూర్బా విద్యాలయాన్ని పరిశీలించి మౌలిక వసతులపై ఆరా తీశారు.