‘కృష్ణమ్మ’ను కొల్లగొడుతున్న లిక్కర్ ఫ్యాక్టరీ ?..అధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు

‘కృష్ణమ్మ’ను కొల్లగొడుతున్న లిక్కర్ ఫ్యాక్టరీ ?..అధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు
  • నదీ జలాలను యథేచ్ఛగా తరలించుకుపోతున్న ఏబీడీ కంపెనీ
  • ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, కలుషితం అవుతున్న నది

వనపర్తి/పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ శివారులోని ఏబీడీ లిక్కర్ ఫ్యాక్టరీ కృష్ణానది జలాలను అక్రమంగా వినియోగించడంతో పాటు నది కాలుష్యానికి పాల్పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రజలు, రైతులు తాగు, సాగు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే.. ఫ్యాక్టరీ మాత్రం భారీ మోటార్ల సాయంతో అనుమతులకు మించి నీటిని వాడుకుంటోందనే ఫిర్యాదులు వస్తున్నాయి.

మరో వైపు ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి చేయకుండా కృష్ణా నదిలోకి వదిలేస్తున్నారని, దీని వల్ల నీళ్లు కలుషితం అవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో కృష్ణానది పూర్తిగా అడుగంటిపోవడంతో సాగునీరు అందక ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ నది ఒడ్డున ఉన్న లిక్కర్ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం 30 హెచ్‌‌పీ, 40 హెచ్‌‌పీ సామర్థ్యం గల మోటార్లతో నీటిని ఫ్యాక్టరీకి తరలించుకుపోతోంది. ఈ విషయమై స్థానికులు ఇప్పటికే పెబ్బేరు తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

మరో వైపు ఫ్యాక్టరీ నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను నదిలోకి విడుదల చేస్తున్నారని దీంతో నీరు కలుషితమై చేపలు చనిపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం బహిరంగంగానే నీటిని తరలిస్తున్నా, నది కలుషితానికి పాల్పడుతున్నా ఇరిగేషన్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

నదీ జలాల వినియోగం, కాలుష్యం విషయంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని స్థానిక ఎమ్మెల్యేను సైతం కోరారు. ఇటీవల ఈ ప్రాంతాన్ని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ పరిశీలించారు. నదీ జలాల అక్రమ వినియోగం, కాలుష్యానికి సంబంధించిన ఆధారాలను సేకరించి గ్రీన్ ట్రిబ్యునల్‌‌లో ఫిర్యాదు చేస్తామని చెప్పారు.