
బోయినిపల్లి(సిరిసిల్ల), వెలుగు: మిడ్ మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల నుంచి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు చుక్కెదురైంది. రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోశ్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మిడ్ మానేరు ప్రాంతానికి ఎమ్మెల్యే రవిశంకర్ వచ్చారు. ఈ సందర్భంగా ముంపు గ్రామాల బాధితులు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సుమారు గంటపాటు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. అంతకు ముందు నీళోజిపల్లి సమీపంలోని రూసో కాలేజీలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే తనను నిర్వాసితులు అడ్డుకుంటారన్న సమాచారం అందడంతో నిర్వాసితులు ఉన్న ప్రాంతం నుంచి కాకుండా మిడ్ మానేరు కట్టపై నుండి గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. ఇది గమనించిన నిర్వాసితులు పరుగు పెడుతూ కట్టపైకి చేరుకొని ఎమ్మెల్యే వాహనం ముందు బైఠాయించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ను బతిమాలైనా హామీలు తీరుస్తానన్న మీరు ఇప్పుడెందుకు తప్పించుకుంటున్నారని ప్రశ్నించారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కదలనిచ్చేది లేదంటూ పట్టుబట్టారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. దీంతో ఎమ్మెల్యే ఎలాంటి హామీ ఇవ్వకుండానే అందరు కలిసి రండి మాట్లాడుదాం అంటూ కారు దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు.