వికారాబాద్, వెలుగు: వికారాబాద్ నుంచి పరిగి వెళ్లే బస్సులు సూర్య ప్రకాశ్ టౌన్షిప్ కాలనీ వద్ద ఆపకపోవడంతో కాలనీవాసులు ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సూర్య ప్రకాశ్ కాలనీ, వెంకటాపూర్ తండా ప్రాంతాల నుంచి వికారాబాద్‌కు వెళ్లాలంటే మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోందని వారు చెప్పారు.
గతంలో ఈ ప్రాంతంలో రిక్వెస్ట్ స్టాప్ కింద బస్సులు నిలిపేవని, ప్రస్తుతం నిలపకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇదిలా ఉండగా, ధారూర్ మండలంలోని నాగారం గ్రామం నుంచి వికారాబాద్‌కు బస్ సర్వీసును ఆదివారం పునరుద్ధరించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ జైదుపల్లి హన్మంత్ రెడ్డి, సర్పంచ్ నీరటి లక్ష్మి శ్రీనివాస్ కృషితో ఈ సర్వీస్ తిరిగి ప్రారంభమైంది.
