అల్వాల్, వెలుగు: పిల్లల కోసం కేటాయించిన ఆట స్థలాలను ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చడంపై ఫాదర్ బాలయ్య నగర్ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆట స్థలాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తే పిల్లలు ఎక్కడ ఆడుకోవాలని ప్రశ్నించారు. గురువారం అల్వాల్ తహసీల్దార్ కార్యాలయం ముందు కాలనీవాసులు ధర్నా నిర్వహించారు.
కాలనీకి కేటాయించిన ఆట స్థలంలో గతంలోనే తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేశారని, దీనిపై కోర్టును ఆశ్రయించామని తెలిపారు. కేసు నడుస్తుండగానే ఇప్పుడు ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు ఆట స్థలం లేకుండా చేయడం తగదన్నారు.
