హైడ్రా వాస్తవాలు తెలుసుకోవాలి .. ఆంటీలియా గేటెడ్ కమ్యూనిటీవాసుల నిరసన

హైడ్రా వాస్తవాలు తెలుసుకోవాలి .. ఆంటీలియా గేటెడ్ కమ్యూనిటీవాసుల నిరసన
  • స్వార్థపరుల మాటలు వినిప్రహరీ ఎలా కూల్చుతారు..?

జీడిమెట్ల, వెలుగు: హైడ్రాను కొందరు స్వార్థపరులు తప్పుదోవపట్టిస్తున్నారని, వారి ట్రాప్​లో పడి వాస్తవాలు తెలుసుకోకుండా చర్యలకు పాల్పడుతున్నారని బాచుపల్లిలోని ఏపీఆర్ ప్రణవ్ ఆంటీలియా గేటెడ్ కమ్యూనిటీ వాసులు ఆరోపించారు. హైడ్రా అన్యాయంగా తమ గోడ కూలగొట్టిందంటూ ఆదివారం రిలే నిరహార దీక్షకు దిగారు. ‘హైడ్రా వాస్తవాలు తెలుసుకోవాలి.. మారోడ్డు మాకే వదిలేయాలి’ అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. మధ్యతరగతికి చెందిన దాదాపు 650 కుటుంబాలు ప్రణవ్ ఆంటీలియా విల్లాలో నివాసం ఉంటున్నారని, పదేండ్ల క్రితమే హెచ్ఎండీఏ తమ కాలనీకి గేటెడ్​కమ్యూనిటీగా గుర్తిస్తూ అనుమతులు ఇచ్చిందన్నారు. 

వీటన్నింటిని పట్టించుకోకుండా హైడ్రా కనీసం తమను సంప్రదించకుండా 100 ఫీట్ల రోడ్డు ఉందని ఎవరో చెప్పిన మాటలు విని ఏకపక్షంగా తమ ప్రహరీని కూల్చిశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వాస్తవాలను హైడ్రా అధికారులకు వివరించినా పట్టించుకోవడం లేదన్నారు. మల్లంపేటలో ట్రాఫిక్​ పెరిగిపోవడంతో తమ కాలనీ గుండా వాహనాలను పంపాలన్న కుట్రతో  ప్రహరీని కూల్చివేశారని ఆరోపించారు.  హైడ్రా అధికారులు తక్షణమే స్పందించి తమ కాలనీ గోడ కూల్చివేతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.