ఇటు సైడ్​ సరే.. అటు వైపు రోడ్డేది .. మెదక్​ వైపు రోడ్డు లేక తిప్పలు

ఇటు సైడ్​ సరే.. అటు వైపు రోడ్డేది .. మెదక్​ వైపు రోడ్డు లేక తిప్పలు
  • మంజీరాపై బ్రిడ్జి కంప్లీట్.. 

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి, మెదక్ జిల్లాల మధ్య ఆయా గ్రామాలకు రాకపోకలు సాగేందుకు నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి సమీపంలో మంజీరా నదిపై బ్రిడ్జి నిర్మించారు. రూ. 25 కోట్ల అంచనా వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ అయి మూడేండ్లు కావస్తోంది. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మెయిన్​ రోడ్డు నుంచి తాండూర్​, వెంకంపల్లి మీదుగా బ్రిడ్జి వరకు జిల్లా వైపు డబుల్ లేన్​ రోడ్డు నిర్మించారు.  మధ్యలో  2 కి.మీ. మేర మిగతా రోడ్డు నిర్మించారు. మంజీరా నదికి ఇటు వైపు కామారెడ్డి జిల్లా, అటు వైపు మెదక్ జిల్లా ఉంటుంది. కామారెడ్డి సైడ్ రోడ్డు వర్క్​ అయినప్పటికీ మెదక్​ జిల్లా వైపు అసలు బీటీ రోడ్డు నిర్మాణం జరగలేదు.  ఈ బ్రిడ్జి నుంచి మెదక్​ జిల్లా యూసుఫ్​పేట వైపు వెళ్తుంది. ఇక్కడి నుంచి పలు ఏరియాలకు రవాణా మార్గం దగ్గరగా ఉంటుంది. 

ప్రస్తుతం పంట పొలాల నుంచి మట్టి రోడ్డు ఉంది.  ఈ మట్టి రోడ్డుపై బైక్​లు, ఆటోలు, కార్లు తదితర వాహనదారులు అవస్థలు పడుతూ వెళ్తుంటారు.  భారీ వెహికల్స్ వెళ్లే వీలులేదు. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట తదితర మండలాల నుంచి మెదక్ జిల్లాలోని పలు ఏరియాలకు వెళ్లే వాళ్లకు మంజీరా బ్రిడ్జి నుంచి రవాణా మార్గం దగ్గర కానుంది. ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్తున్నారు.  కామారెడ్డి వైపు కొంత మేర ఆగిపోయిన రోడ్డు నిర్మాణంతో పాటు, మెదక్​ జిల్లా వైపు  బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు.