హోటళ్లు, థియేటర్లకు 15 లక్షల వరకు రీస్టార్ట్ ప్యాకేజీ

హోటళ్లు, థియేటర్లకు 15 లక్షల వరకు రీస్టార్ట్ ప్యాకేజీ
  • తుఫాను బాధిత రైతులకు రూ.718 కోట్లు
  • కౌలురైతులు సహా ప్రతి రైతు ఖాతాలో మూడో విడత
  • రైతు భరోసా సొమ్ము ఏపీ కేబినెట్​ నిర్ణయాలు

అమరావతి, వెలుగు: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీ ముగిసింది. నివర్​ తుఫాను బాధిత రైతులకు రూ.718 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు, మూడేండ్ల గడువుతో డిసెంబర్​ 21 నుంచి సమగ్ర భూ సర్వే చేపట్టడం సహా పలు నిర్ణయాలు తీసుకుంది. మూడో విడత రైతు భరోసా కింద కౌలురైతులు సహా ప్రతి రైతు ఖాతాలో నేరుగా రూ.2వేలు వేయనున్నారు. కరోనాతో దెబ్బతిన్న హోటళ్లకు, ఫంక్షన్‌ హాళ్లకు, సర్వీసు ప్రొవైడర్లకు, రెస్టారెంట్లకు రీస్టార్ట్‌ ప్యాకేజీకి అమలు చేయన్నారు. మొత్తంగా 3910 యూనిట్లకు ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. ఒక్కో యూనిట్​కు రూ.50 వేల నుంచి గరిష్టంగా రూ.15 లక్షల వరకూ లోన్ ఫెసిలిటీ. అలాగే ఏపీలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీని రూపొందించనున్నారు. ఇందులో కొత్త టూరిజం యూనిట్​ పెట్టే వాళ్లకు నెట్‌ ఎస్‌జీఎస్టీలో 100 శాతం రీయింబర్స్‌మెంట్‌, ఐదేండ్లపాటు యూనిట్‌ కరెంటు రూ.2లకే. ల్యాండ్‌ యూజ్‌ కన్వెర్షన్‌ ఛార్జీల్లో 100 శాతం మాఫీ తదితర ప్రయోజనాలు కల్పించాలని నిర్ణయించారు. కరోనా ఎఫెక్ట్ తో కొన్ని నెలలపాటు మూతపడ్డ థీయేటర్లను ఆదుకునేందుకు ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ  ఛార్జీలు రద్దు చేయనున్నారు. రీస్టార్ట్‌ ప్యాకేజీకింద  ఏ, బీ, సెంటర్లలో థియేటర్లకు రూ.10లక్షల చొప్పున, సి- సెంటర్లలో ఉన్న థియేటర్లకు రూ. 5లక్షల చొప్పున లోన్లు ఇవ్వనున్నారు. ఏపీ మెడికల్‌ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఈఆర్‌సీ) ఏర్పాటు చేయాలని నిర్ణయం. దీంతో ఆస్పత్రులు, నర్సింగ్‌ కాలేజీలను బలోపేతం చేయడంతోపాటు కొత్త మెడికల్​ కాలేజీలు, హాస్పిటళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.