KTR ఆదేశాల తర్వాత మీడియాపై పెరిగిన ఆంక్షలు

KTR ఆదేశాల తర్వాత మీడియాపై పెరిగిన ఆంక్షలు

ప్రభుత్వ తీరును తప్పుపడుతున్న ప్రతిపక్షాలు, జర్నలిస్ట్​ సంఘాలు

వరంగల్‍, వెలుగు: మంత్రి కేటీఆర్ ఆదేశాల తర్వాత జిల్లాల్లో  మీడియాపై ఆంక్షలు పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు కార్పొరేట్​, కౌన్సిల్​ మీటింగులకు మాత్రమే జర్నలిస్టులను అనుమతించని ఆఫీసర్లు ఇప్పుడు జిల్లా కలెక్టరేట్లు, పోలీస్ ​ఆఫీసుల్లో జరిగే గ్రీవెన్స్ కూ రావద్దంటున్నారు. వివిధ రివ్యూమీటింగులకు, జడ్పీ సమావేశాలకు కూడా అనుమతిస్తలేరు. గ్రీవెన్స్​లు, మీటింగులు ముగిశాక ఆఫీసర్లే పేపర్లలో రాసుకునేందుకు ప్రెస్​నోట్లు, చానల్స్​లో చూపించేందుకు విజువల్స్ ఇస్తున్నారు. లోపల జరిగింది జరిగినట్లు కాకుండా సమస్యలు దాచి, సర్కారుకు అనుకూలంగా ఉండే సమాచారం మాత్రమే ఇస్తుండడంతో ఆఫీసర్ల దృష్టికి జనం తెస్తున్న సమస్యలు, ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలు బయటకు రావడం లేదు. ఇది ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కును హరించడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మంత్రి కేటీఆర్​ చెప్పారని.. 

ఇటీవల కరీంనగర్​లో ఓ మహిళా కార్పొరేటర్ ​తన వార్డులో నీళ్లు రావడం లేదని బిందె, బకెట్​తో నిరసన తెలిపారు. ఈ వార్త  పేపర్లు, చానళ్లలో రావడంతో మంత్రి కేటీఆర్ కు కోపం వచ్చింది. వెంటనే మే 13న హైదరాబాద్‍ లో నిర్వహించిన మేయర్లు, కమిషనర్ల మీటింగులో కేటీఆర్ ​ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ  కార్పొరేషన్​, కౌన్సిల్​మీటింగులకు మీడియాను అనుమతించవద్దని ఓ ఆర్డర్​ వేశారు.

అప్పటి నుంచి ఆఫీసర్ల చేతికి అస్త్రం దొరికినట్లయింది. మొదట కౌన్సిల్​, కార్పొరేషన్​ మీటింగులకు మాత్రమే జర్నలిస్టులను రానివ్వలేదు. ఆ తర్వాత గడిచిన వారం, పది రోజుల్లో అన్ని శాఖల అధికారులు ఇలాగే తయారయ్యారు. వివిధ రివ్యూ మీటింగులకు, జడ్పీ సమావేశాలకు మీడియాను రాకుండా అడ్డుకుంటున్నారు. కొన్ని జిల్లాల్లో మరో అడుగు ముందుకేసి ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లు, పోలీస్ ​ఆఫీసుల్లో జరిగే ప్రజావాణి(గ్రీవెన్స్​)కి సైతం జర్నలిస్టులకు పర్మిషన్​ ఇవ్వడం లేదు. అన్ని జిల్లాల్లో కొంతకాలంగా కార్పొరేషన్​, కౌన్సిల్​ మీటింగులకు మీడియాను అనుమతించని విషయం తెలిసిందే.

కొత్తగా వరంగల్‍, హన్మకొండ జిల్లాల్లో కలెక్టరేట్‍, కార్పొరేషన్‍, పోలీస్​ఆఫీసుల్లో నిర్వహించే గ్రీవెన్స్ కవరేజీకి కూడా మీడియాకు పర్మిషన్‍ ఇయ్యట్లేదు. మంత్రులు, జిల్లా ఆఫీసర్లతో నిర్వహించే శాఖాపరమైన రివ్యూల కవరేజీకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. పోలీస్‍ కమిషనరేట్‍లో ప్రెస్‍మీట్లు పెట్టడం బంద్‍ చేశారు. నిర్మల్‍ జిల్లాలో కలెక్టరేట్‍ రివ్యూలు, పోలీస్‍ గ్రీవెన్స్​కు వెళ్లకుండా  అడ్డుకుంటున్నారు. నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ప్రజావాణి, ఇతరత్రా రివ్యూలకు జర్నలిస్టులను అనుమతిస్తలేరు. గద్వాల జిల్లాలో మరో అడుగు ముందుకేసి జిల్లా పరిషత్‍ మీటింగ్‍ లకు రానివ్వడం లేదు. పెద్దపల్లి, మెదక్‍, ఖమ్మం తదితర జిల్లాల్లోనూ రివ్యూ మీటింగులకు పర్మిషన్​ ఇవ్వడం లేదు. ఆసిఫాబాద్‍ లాంటి వెనుకబడిన జిల్లాలోనూ కలెక్టరేట్‍, పోలీస్‍ గ్రీవెన్స్ కు మీడియాను అనుమతించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 

ప్రజా సమస్యలు బయటకు రావట్లే

ప్రజాధనంతో నడుపుతున్న మీటింగుల్లో ఏం జరుగుతుందో  తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మీటింగుల్లో ఏం మాట్లాడుతున్నారో, తమ సమస్యలను అసలు ప్రస్తావిస్తున్నారో లేదో జనం తెలుసుకోవాలనుకుంటారు. అలాగే తాము కట్టే పన్నులతో అధికారులు ఎలా పనిచేస్తున్నారో ఒక అంచనాకు వస్తుంటారు. మీటింగుల్లో ప్రజాప్రతినిధులు, గ్రీవెన్స్​లో ప్రజలు ఆఫీసర్ల దృష్టికి తెచ్చే సమస్యలను ఆధారం చేసుకొని జర్నలిస్టులు వాటి వెనుక అసలు కారణాలను ప్రత్యేక కథనాల ద్వారా బయటపెడ్తారు. దీంతో సమస్యలు ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి  పరిష్కరించే వీలుంటుంది. ఉదాహరణకు ధరణి వల్ల సామాన్యుల కష్టాలను మీడియా వెలుగులోకి తేవడం వల్లే కొత్త మాడ్యూల్స్​ను సర్కారు ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు మీటింగులు, గ్రీవెన్స్​లకు మీడియాను అనుమతించని ప్రభుత్వం, ప్రజా సమస్యలు బయటకు రాకుండా చేస్తోంది. చివర్లో ఆఫీసర్లు ఇచ్చే ప్రెస్​నోట్లు, ఫొటోలు, విజువల్స్ లలో వాస్తవాలు దాచిపెట్టి సర్కారుకు అనుకూలంగా ఉండే సమాచారాన్ని మాత్రమే బయటపెడ్తున్నారు. మే 19న గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్‍ మీటింగ్‍ సందర్భంగా పలు డివిజన్లలో నీటి లీకేజీలు, గతేడాది పట్టణ ప్రగతి పనుల్లో జరిగిన అక్రమాలు, విలువైన ప్రభుత్వ స్థలాన్ని అన్యాక్రాంతం చేయడం సహా అనేక అంశాలపై సభ్యులు మండిపడినట్లు తెలిసింది. తమకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని రూలింగ్​ పార్టీ కార్పొరేటర్లు ఫైర్‍ అయినట్లు చెబుతున్నారు. కానీ ఈ విషయాలేవీ ఆఫీసర్లు ఇచ్చిన  ప్రెస్‍నోట్‍లో లేకపోవడం గమనార్హం. 

మీడియాపై ఆంక్షలు అప్రజాస్వామికం

 మీడియాపై ఆంక్షలు విధించడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కు ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలను లైవ్​ టెలికాస్ట్​ చేస్తున్నప్పుడు జిల్లాల్లో కౌన్సిలింగ్​, జడ్పీ, శాఖాపరమైన రివ్యూ మీటింగులను అడ్డుకోవడంలో అర్థం లేదు. సమైక్య రాష్ట్రంలో, అత్యంత కఠినమైన ముఖ్యమంత్రుల పాలనలోనూ మీడియాపై ఇలాంటి ఆంక్షలు లేవు. ఇకనైనా ప్రభుత్వం తన తీరు మార్చుకొని ఎప్పట్లాగే అన్ని మీటింగులకు జర్నలిస్టులను అనుమతించాలి. 
- శ్రీధర్ రెడ్డి , (టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ప్రెసిడెంట్, 
వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు.

ఇది నిజాలు దాచడమే... 

జిల్లాల్లో అన్ని రకాల అధికారిక కార్యక్రమాలకు, రివ్యూలు, ఇతర  మీటింగులకు మీడియాను తప్పనిసరిగా అనుమతించాలి. అప్పుడే లోపల ఏం జరుగుతుందో జనాలకు తెలుస్తుంది. లేదంటే ఆఫీసర్లు, ప్రజా ప్రతినిధులు తమకు అనుకూలంగా ఉండే సమాచారాన్ని మాత్రమే ప్రెస్ నోట్ రూపంలో రిలీజ్ చేస్తారు. మీడియా మీద ఆంక్షలు పెట్టడం అంటే.. నిజాలను దాచడమే అవుతుంది. ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రతినిధులు, ఆఫీసర్లు ఏం చేస్తున్నారనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది మీడియా ద్వారానే సాధ్యం అవుతుంది. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకుంటే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. -తిరునహరి శేషు, బీసీ ప్రజాసంఘాల రాష్ట్రనేత