
నిర్మల్/ భైంసా, వెలుగు : బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో అడుగడుగునా నిర్బంధం కొనసాగుతోందన్న ఆరోపణలున్నాయి. క్యాంపస్ లో ఫుడ్ పాయిజన్ జరిగినప్పటి నుంచి విద్యార్థులపై కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. దీంతో స్టూడెంట్స్ మధ్య కమ్యూనికేషన్ కొరవడుతోంది. విద్యార్థులు ఒకరి ఆలోచనలు మరొకరితో పంచుకుంటే వారిలో దాగి ఉన్న సృజనాత్మకత బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఒకరు తెలుసుకున్న సమాచారం మరొకరికి అందించినప్పుడే స్కిల్స్ డెవలప్అయ్యే అవకాశాలుంటాయి. అలాంటిది ఫుడ్ పాయిజన్ ఘటన జరిగినప్పటి నుంచి ట్రిపుల్ ఐటీ అధికా రులు కఠిన ఆంక్షలు అమలు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయాన్ని బయటకు చెబితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, అందుకే సైలెన్స్‌గా ఉంటున్నామంటున్నారు.
ఎంపిక చేసిన వారితోనే ఇంటరాక్షన్
ట్రిపుల్ఐటీ అధికారులు..క్యాంపస్‌లో విద్యార్థులు ఒకే చోట గుమిగూడకుండా చూస్తున్నారని తెలుస్తోంది. మీటింగులు, కాన్ఫరెన్సులు, ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు స్టూడెంట్స్ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. క్యాంపస్ కు మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చిన సందర్భాల్లోనూ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ బాధ్యులను ఆంక్షల పేరిట దూరంగా ఉంచుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఈ మధ్య మంత్రి కేటీఆర్ క్యాంపస్ కు వచ్చినపుడు కూడా ఎస్జీసీ బాధ్యులను కలవకుండా.. ఎంపిక చేసిన కొంతమందితో మాత్రమే ఇంటరాక్షన్ నిర్వహించారని చెబుతున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటన కారణంగా మొదలైన ఉద్యమం టైం నుంచి ఎస్జీసీ బాధ్యులపై ఉన్నతాధికారులు నజర్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. వీరి ఫోన్లపై నిఘాతో పాటు వారి కదలికలపై దృష్టి సారిస్తున్నారంటున్నారు.
తల్లిదండ్రులనూ రానిస్తలేరు
క్యాంపస్‌లో ఏదైనా ఘటన జరిగితే విద్యార్థుల తల్లిదండ్రులను కూడా అనుమతించడం లేదు. ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్జరిగినప్పుడు కూడా ఇదే పద్ధతిని అవలంబించారు. దీంతో తమ పిల్లలకు ఏమైందోనని తల్లిదండ్రులు టెన్షన్ పడ్డారు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది. పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు లేదా క్యాంపస్ లో ఏదైనా ఇతర సంఘటన జరిగినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులను అనుమతిస్తే అక్కడి వాస్తవ పరిస్థితులను వారు గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే అధికారులు మాత్రం తల్లిదండ్రులను క్యాంపస్ లోకి రాకుండా అడ్డుకొని వెనక్కి పంపుతున్నారు. దీన్ని నిరసిస్తూ గతంలో హైదరాబాద్ లో పేరెంట్స్అసోసియేషన్మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారుల తీరును విమర్శించింది. అలాగే క్యాంపస్ లోకి మీడియాను కూడా అనుమతించడం లేదు. ఇటీవల జరిగిన ఐటీ స్నాతకోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరుకాగా, దీనికి కొంతమంది ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులకు మాత్రమే పాస్‌లు జారీ చేసి అనుమతించారు.
ఆ సమయాల్లో మరింత నిర్బంధం...
నాలుగు నెలల్లో క్యాంపస్‌లోని ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత ఆదివారం రంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థి సూసైడ్ చేసుకోగా అధికారులు ఎవరికి సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని నిర్మల్ దవాఖానాకు తరలించారన్న విమర్శలున్నాయి. మృతుడు తల్లి, కుటుంబసభ్యులు కూడా ఈ విషయంలో అధికారుల తీరును విమర్శించారు. నాలుగు నెలల క్రితం కూడా కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ స్టూడెంట్క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకోగా చివరి వరకు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. దీనిపై కూడా పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు క్యాంపస్ లో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు, శ్రద్ధాంజలి, నివాళులర్పించే కార్యక్రమాలు కూడా చేపట్టలేని పరిస్థితులు నెలకొన్నాయన్న వాదనలున్నాయి. విద్యార్థుల డెడ్‌బాడీలను పోస్టుమార్టం కోసం ఇక్కడి జిల్లా దవాఖానాకు తీసుకువచ్చినప్పుడు హాస్పిటల్లోకి వెళ్లేందుకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులకు పోలీసులు అనుమతినివ్వడం లేదు. దీంతో ఆందోళనలకు కారణమవుతోంది. గత సోమవారం ట్రిపుల్ఐటీ విద్యార్థి భానుప్రసాద్ మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్న విమర్శలున్నాయి.