రాష్ట్రంలో వైన్ షాపులు, సినిమా థియేటర్లపై ఆంక్షలు!

రాష్ట్రంలో వైన్ షాపులు, సినిమా థియేటర్లపై ఆంక్షలు!
  • రాష్ట్రంలో మరోసారి కరోనా ఆంక్షలు విధించాలన్న హైకోర్టు
  • ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి

కరోనా ఉధృతి పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కరోనా పరిస్థితిపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పబ్‌లు, క్లబ్బులు, మద్యం షాపులు, సినిమా థియేటర్లలో రద్దీపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ టెస్టులు భారీగా పెంచాలని సూచించింది. అదేవిధంగా ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టు ఉంటేనే ఇతర రాష్ట్రాల వారిని రాష్ట్రంలోకి అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. వందమంది ఉద్యోగులు ఉన్న ఆఫీసుల్లో అక్కడే వ్యాక్సినేషన్ చేయాలని సూచించింది. సీరో పరీక్షలు పూర్తయ్యాక నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లాక్‌డౌన్ ఉన్నా లేకపోయినా కంటైన్‌మెంట్ జోన్లను కచ్చితంగా గుర్తించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. మద్యం దుకాణాలు కరోనా వనరులుగా మారాయని హైకోర్టు మండిపడింది. నిపుణులతో సలహా కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 

నిబంధనలు పాటించని వారిపై చర్యలు అంతంతమాత్రంగా ఉన్నాయని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అందుకు స్పందించిన డీజీ.. నిబంధనల ఉల్లంఘనలపై సుమారు 22వేల కేసులు నమోదు చేసినట్లు హైకోర్టుకు తెలిపారు. సామాజిక దూరం పాటించని వారిపై 2,416 కేసులు, రోడ్లపై ఉమ్మిన వారి మీద 6 కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే డీజీ వ్యాఖ్యలపై స్పందించిన హైకోర్టు.. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1.16 లక్షల మందికే జరిమానానా? అని ప్రశ్నించింది. పాతబస్తీలో రెండు రోజులు తనిఖీ చేస్తే లక్ష మంది దొరుకుతారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వ్యాక్సినేషన్‌కు ఏం ఏర్పాట్లు చేస్తున్నారో తెలపాలని కోరింది. ఈ నెల 14లోగా పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది.