భారీగా తగ్గిన టూవీలర్ల సేల్స్​

భారీగా తగ్గిన టూవీలర్ల సేల్స్​

న్యూఢిల్లీ :  దేశీయ మార్కెట్లో ఆటోమొబైల్స్ రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో 7.73 శాతం క్షీణించి 21,17,596 యూనిట్లకు చేరుకున్నాయి. 2022 అక్టోబర్ లో దేశీయ మార్కెట్లో ఆటోమొబైల్స్ రిటైల్ అమ్మకాలు 22,95,099 యూనిట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా టూవీలర్ల అమ్మకాలు బాగా తగ్గిపోయాయని ఫెడరేషన్​ ఆఫ్​ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) తెలిపింది. గత నెల మొదటి రెండు వారాల్లో మంచి రోజులు లేకపోవడం కూడా అమ్మకాలు తగ్గడానికి కారణమని తెలిపింది. 

ఫాడా తాజా డేటా ప్రకారం, గత నెలలో టూ-వీలర్ రిటైల్ అమ్మకాలు 15,07,756 యూనిట్లుగా ఉన్నాయి. అంతకు ముందు సంవత్సరం అక్టోబరులో 17,25,043 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే అమ్మకాలు 12.60 శాతం తగ్గాయి.  ప్యాసింజర్ వెహికల్ (పివి) రిటైల్ అమ్మకాలు 1.35 శాతం తగ్గి 3,53,990 యూనిట్లకు పడిపోయాయి. త్రీవీలర్ విక్రయాలు 45.63 శాతం పెరిగి 1,04,711 యూనిట్లకు చేరాయి. అంతకు ముందు ఏడాది అక్టోబరు నెలలో 71,903 యూనిట్లు అమ్ముడుపోయాయి. 

ట్రాక్టర్ల అమ్మకాలు  58,823 యూనిట్ల నుండి 62,440 యూనిట్లకు పెరిగాయి. కమర్షియల్ ​వెహికల్స్​ రిటైల్ విక్రయాలు ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో 10.26 శాతం పెరిగి 88,699 యూనిట్లకు చేరాయని ఫాడా ప్రెసిడెంట్​ మనీష్ రాజ్ సింఘానియా అన్నారు. వార్షికంగా అమ్మకాలు తగ్గినా, నెలవారీగా చూస్తే 13 శాతం పెరిగాయని తెలిపారు.   ట్రాక్టర్లు మినహా, అన్ని సెగ్మెంట్లు ఆశించిన వృద్ధిని సాధించాయని. నవరాత్రి సందర్భంగా  టూవీలర్ల అమ్మకాలు 22 శాతం, త్రీవీలర్ల అమ్మకాలు 43 శాతం, కమర్షియల్​ వెహికల్స్​9 శాతం, పీవీల అమ్మకాలు 7 శాతం పెరిగాయని ఆయన వివరించారు. అయితే పీవీ సెగ్మెంట్లో ఇన్వెంటరీ స్థాయి 63–66 రోజుల వరకు ఉందని ఫాడా ఆందోళన ప్రకటించింది. దీనిని తగ్గించడానికి కంపెనీలు డిస్పాచ్​లను కుదించాలని, ఆఫర్లను పెంచాలని సూచించింది.

దీపావళిపై ఆశలు...

పండుగ సీజన్​వల్ల తమ అమ్మకాలు మరింత పెరుగుతాయని ఆటోమొబైల్ ​కంపెనీలు భావిస్తున్నాయి. ఇవి వాడే కమోడిటీల ధరలు తగ్గాయి. మార్జిన్లు పెరగడం మొదలయింది. సెమీ కండక్టర్ల కొరత లేదు. నిఫ్టీ ఆటో ఇండెక్స్​ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 28 శాతం పెరిగింది. ఈ నెలే ఇది 1.7 శాతం పెరిగింది. వార్షికంగా అమ్మకాలు తగ్గినప్పటికీ నవరాత్రి సమయంలో బుకింగ్స్​భారీగా వచ్చాయి. కొత్త మోడల్స్​.. ముఖ్యంగా ఎస్​యూవీలు పెద్ద ఎత్తున లాంచ్​ అయ్యాయి. జనం వీటిని కొనడానికి ఎగబడుతున్నారు. నవరాత్రి సమయంలో వెహికల్​ రిజిస్ట్రేషన్లు 18 శాతం పెరిగాయి. 

ఇది ఆల్​టైం హై కావడం విశేషం. అయితే ఎన్నికల కారణంగా కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు మందకొడిగా ఉన్నాయి. పీవీల​ రిజిస్ట్రేషన్లు మాత్రం నవరాత్రుల సమయంలో 6.5 శాతం పెరిగాయి. ఈ ఏడాది అక్టోబరు రిజిస్ట్రేషన్లు వార్షికంగా 1.36 శాతం తగ్గాయి. అక్టోబరులో మంచి రోజులు లేకపోవడం ఇందుకు కారణమని ఫాడా తెలిపింది. అయినప్పటికీ నెలవారీగా అమ్మకాలు బాగానే పెరిగాయి. అందుకే టాటా మోటార్స్​​, బజాజ్​ ఆటో, టీవీఎస్​ మోటార్స్​ షేర్లు బాగా పెరుగుతున్నాయి. మిగతా ఆటో కంపెనీల షేర్లు కూడా లాభాల బాటలోనే ఉన్నాయి.