థర్డ్​వేవ్​ భయంతో రిటెయిలర్లు, డిస్ట్రిబ్యూటర్లు స్టాకు తగ్గించుకుంటున్నరు

థర్డ్​వేవ్​ భయంతో రిటెయిలర్లు, డిస్ట్రిబ్యూటర్లు స్టాకు తగ్గించుకుంటున్నరు

వెలుగు, బిజినెస్​ డెస్క్​:  టెలివిజన్లు, చెప్పులు వంటి ప్రొడక్టులు అమ్మే రిటెయిలర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆయా ప్రొడక్టుల నిల్వలను మూడో వంతుకు తగ్గించేసుకుంటున్నారు. కరోనా వైరస్​ కేసులు మళ్లీ పెరుగుతుండటమే దీనికి కారణం. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో అమ్మకాలు ఎలా ఉంటాయోననే భయంతోనే నిల్వలను తగ్గించుకుంటున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతంలో నెల రోజులకు సరిపడా నిల్వలను అట్టేపెట్టుకునే రిటెయిలర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు 15 రోజులకు తగిన నిల్వలనే ఉంచుకుంటున్నారు. గత రెండు వేవ్​ల అనుభవంతో వారు ఈ విధంగా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఒకవేళ బిజినెస్​ తగ్గినా, క్యాష్​ ఫ్లో ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. ఈ ఎఫెక్ట్​ జనవరిలో బిజినెస్​పై పడుతుందని మాన్యుఫాక్చరర్లు చెబుతున్నారు. దీపావళి కారణంగా కిందటి క్వార్టర్లో మంచి అమ్మకాలు రికార్డయ్యాయి. రిటెయిలింగ్​ బిజినెస్​లోని పెద్ద చెయిన్లు కూడా ఇదే ధోరణితో ఉన్నాయని, ఇది కన్జూమర్​ డిమాండ్​పై ఎఫెక్ట్​ చూపెడుతుందని హెయిర్​ ఇండియా ప్రెసిడెంట్​ సతీష్​ ఎన్​ఎస్​ చెప్పారు. కరోనా వైరస్​ మూడో వేవ్​ ప్రభావం బిజినెస్​పై పడుతుందనే ఆందోళన రిటెయిలర్లు, డిస్ట్రిబ్యూటర్లలో పెరుగుతోందని పేర్కొన్నారు. 

కొత్త ఆర్డర్లు పెట్టే ముందు ఒకటికి, రెండు సార్లు ఆలోచిస్తున్నట్లు లైఫ్​స్టైల్​ ఇంటర్నేషనల్​ సీఈఓ దేవరాజన్​ అయ్యర్​ వెల్లడించారు. రాబోయే రెండు వారాలలో ఆంక్షల పరిస్థితి చూసి, కొత్త ఆర్డర్ల విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కొవిడ్​ కేసులు అంతకంతకు ఎక్కువవడంతో వివిధ రాష్ట్రాలు ఆంక్షలు పెడుతున్నాయి. నైట్​ కర్ఫ్యూతోపాటు, నాన్​–ఎసెన్షియల్​ స్టోర్ల బిజినెస్​ పనివేళలు తగ్గించడం వంటి చర్యలనూ ప్రకటిస్తున్నాయి. ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇప్పటికే వీకెండ్​ కర్ఫ్యూలను విధించాయి. ఆంక్షల నేపథ్యంలో డిమాండ్​ను చూసే కొత్త ఆర్డర్లను ప్లేస్​ చేయనున్నట్లు టీసీఎన్​ఎస్​ క్లోతింగ్​ మేనేజింగ్​ డైరెక్టర్​ అనంత్​ కుమార్​ డాగా చెప్పారు. ఒకేసారి ఎక్కువగా కొనడం లేదని పేర్కొన్నారు. డీలర్లు స్టాకులు తగ్గించుకుంటున్నట్లు  కంపెనీలు కూడా చెబుతున్నాయి. వేసవి  కోసం ఫ్రిజ్​లు, ఏసీలు వంటి వాటిని  జనవరి నుంచే డీలర్లు కొనుగోలు చేస్తారని, ఈసారి అలా జరగడం లేదని పేర్కొంటున్నాయి. మూడో వేవ్​ ఎఫెక్ట్​తో గత రెండు వారాల నుంచే డీలర్లు తమ నిల్వలు తగ్గించుకుంటున్నారని క్యారియర్​ మీడియా ఇండియా చైర్మన్​ క్రిష్ణన్​ సచ్​దేవ్​ చెప్పారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రేట్లు పెంచే ఛాన్స్​ ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ప్రొడక్టుల నిల్వలను డీలర్లు పెంచుకుంటారన్న తమ అంచనాలు నిజం కాలేదని మోతిలాల్​ ఓస్వాల్​ తెలిపింది.