అన్ని పొలిటికల్​ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాలి : ఆకునూరి మురళి

అన్ని పొలిటికల్​ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాలి : ఆకునూరి మురళి

ముషీరాబాద్,వెలుగు: రాష్ట్రంలో విద్య, వైద్యంలో వెనకబడిపోయామని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. రాష్ట్ర సంపదను దృష్టిలో పెట్టుకొని వైద్యానికి 8 శాతం బడ్జెట్ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోగ్యానికి పెద్దపీట వేసేలా అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాలని కోరారు. ‘వైద్య ఆరోగ్య అభివృద్ధికి ప్రతిపాదనలు, తెలంగాణలో వైద్య, ఆరోగ్య సేవలు ఎట్లుండాలె’ అనే అంశంపై సోషల్ డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మురళి హాజరై.. వైద్య, ఆరోగ్య అభివృద్ధి ప్రతిపాదనల బుక్కును రిలీజ్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు అధ్వానంగా తయారయ్యాయన్నారు. ఉస్మానియా ఆసుపత్రి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కోటి, కాకతీయ, చెస్ట్ హాస్పిటల్​ ఇలా ఏ ఆస్పత్రినీ సర్కారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గ్రామాల్లో ఉన్న 70% సామాన్య ప్రజలు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తారని, డాక్టర్స్ పట్టణాలకే పరిమితమైతే రూరల్ ఏరియాల్లో వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. గ్రామస్థాయిలో డాక్టర్స్ ఉన్నప్పుడే సామాన్యులకు వైద్యం అందుతుందని తెలిపారు. ఇప్పటివరకు వైద్య రంగానికి ఖర్చు చేస్తున్నది 1.1 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. హెల్త్​కు ఖర్చు చేయడంలో కేంద్రం, రాష్ట్రం ఒకేలా ఉన్నాయని విమర్శించారు. కమిషన్ వచ్చే వాటిపైనే దృష్టి సారిస్తున్నాయని ఫైర్​ అయ్యారు. వైద్యం మీద దృష్టి పెట్టకుండా రాజకీయ తమాషా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందాలంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లో దోపిడీని నివారించాలని కోరారు. ఎలక్షన్ హడావుడి నిర్ణయాలు కాకుండా మెరుగైన ఆసుపత్రులు, వైద్యం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మురళి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ రమ, డాక్టర్ పృథ్వీరాజ్, డాక్టర్ ప్రీతి దయాల్, డాక్టర్ జగదీశ్​, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.