
జెనీలియా అనే అసలు పేరు కన్నా ‘హాసిని..’అనే పాత్ర పేరుతోనే తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయిందామె. సత్యం, బొమ్మరిల్లు, ఢీ, హ్యాపీ, రెడీ, ఆరెంజ్ లాంటి చిత్రాలతో మెప్పించిన ఆమె.. పదమూడేళ్ల విరామం తర్వాత ‘జూనియర్’ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తోంది.
కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి నిర్మించారు. ఈనెల 18న సినిమా విడుదల సందర్భంగా ఈ సినిమా గురించి, తన కెరీర్ గురించి జెనీలియా ఇలా ముచ్చటించారు.
మూడేళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది. అప్పటికి నా పిల్లల ఆలనాపాలనపైనే దృష్టి పెట్టిన నేను.. అప్పటికి తిరిగి నటించాలా, వద్దా అనే నిర్ణయం తీసుకోలేదు. నా భర్త రితేష్ ఈ కథ గురించి చాలా పాజిటివ్‌గా చెప్పారు. ఒకసారి విన్న తర్వాత నిర్ణయం తీసుకో అన్నారు.
ALSO READ : నేటి తరానికి .. ఇలాంటి సినిమాలు చాలా అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
దర్శకుడు రాధాకృష్ణ చెప్పిన కథతో పాటు పాత్ర కొత్తగా అనిపించింది. ఇందులో నా పాత్ర చాలా స్పెషల్. బాస్‌గా గంభీరమైన పాత్రలో కనిపిస్తా. ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఎక్సయిట్మెంట్ నాకూ ఉంది. నిర్మాత సాయి గారు చాలా కేర్ తీసుకున్నారు. సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్‌గా నిర్మించారు.
తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో సాగే ఓ అద్భుతమైన ప్యాకేజ్ ఇది. దేవి శ్రీ ప్రసాద్, సెంథిల్ కుమార్ లాంటి వాళ్లతో తిరిగి పనిచేయడం రీ యూనియన్‌లా అనిపించింది. కిరీటి వెరీ కాన్ఫిడెంట్ యాక్టర్. అలాగే డ్యాన్స్, పెర్ఫార్మెన్స్ లాంటివన్నీ అద్భుతంగా చేశాడు. శ్రీలీల అమేజింగ్ డాన్సర్. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది.
పెళ్లి కారణంగా కెరీర్‌లో బ్రేక్ తీసుకున్నందుకు ఎలాంటి రిగ్రెట్ లేదు. జీవితం అన్నాక అన్నీ ఉండాలిగా. సాధారణంగా హీరోయిన్స్‌కు ఎక్కువ మేల్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ నాకు ఫిమేల్ ఆడియన్స్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో నన్నెవరూ జెనీలియా అని పిలవరు.. హాసిని అనే పిలుస్తారు. అంతలా అభిమానించడం సంతోషంగా ఉంది.
‘ఆర్ఆర్ఆర్’సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను చూసి గతంలో వీళ్లతోనేనా నేను నటించింది అనిపించింది. ఇండస్ట్రీకి దొరికిన వరం ఎన్టీఆర్. మూడు పేజీల డైలాగ్‌ని కూడా సింగిల్ టేక్‌లో చెప్పేస్తాడు. అలాగే రామ్ చరణ్ అద్భుతమైన నటుడు. తనతో కలిసి ‘ఆరెంజ్’లో నటించా. ‘ఆర్ఆర్ఆర్’లో తన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇక అల్లు అర్జున్ చాలా ఎనర్జిటిక్. ఇప్పుడు వీళ్లందరినీ పాన్ ఇండియా స్టార్స్‌గా చూస్తుంటే హ్యాపీగా ఉంది.
కోట శ్రీనివాసరావు గారి మరణ వార్త విని దిగ్బ్రాంతికి గురయ్యాను. ఎంతో గొప్ప నటుడు. ‘బొమ్మరిల్లు’చిత్రం షూటింగ్ టైమ్‌లో ఆయన నుంచి చాలా నేర్చుకున్నా.‘రెడీ’లోనూ కలిసి నటించాం. అంత గొప్ప నటుడితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నా అదృష్టం.
నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవు. నటిని కావాలనుకోవడమే పెద్ద డ్రీమ్. అనుకున్నట్టుగానే అయ్యాను. శంకర్ గారి ‘బాయ్స్, రాజమౌళి గారి ‘సై’,దిల్ రాజు, భాస్కర్‌ల ‘బొమ్మరిల్లు’ప్రేక్షకులకు నన్ను మరింతగా దగ్గర చేశాయి.
మంచి క్యారెక్టర్స్ వస్తే నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తెరపై ఎంతసేపు కనిపించామనేది కాదు.. ఆ పాత్ర సినిమాపై ఎంత ప్రభావం చూపించిందనేది ముఖ్యం.