
న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, వాటాలు, అనుమతులు, కొత్త ప్రాజెక్టుల అంశంపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో బుధవారం (జూలై 16) కీలక సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హాజరయ్యారు. వీరితో పాటు తెలంగాణ, ఏపీ ఇరిగేషన్ మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రామానాయుడు కూడా అటెండ్ అయ్యారు.
దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కమిటీ పని చేయనుంది. కమిటీలో రాష్ట్ర, కేంద్ర అధికారులు, సాంకేతిక సభ్యులుగా ఉంటారు. 2025, జూలై 21 లోపు ఈ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులను తక్షణమే చేపట్టాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించారు. అలాగే, గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుల ఏర్పాటుపైన కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ), ఏపీ రాజధాని అమరావతిలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంది.
ALSO READ : జలశక్తి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ : తెలంగాణ అంశాలు ఇవే
దీనిని అలాగే కొనసాగించనున్నారు. కేఆర్ఎంబీని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. అలాగే, రిజర్వాయర్ల వద్ద టెలీమెట్రీల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారు. శ్రీశైలం ప్లంజ్పూల్ను మూసేయాలని కూడా ఈ మీటింగ్లో నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం అవసరమైతే మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు.