బనకచర్ల కడతామని ఏపీ చెప్పలేదు.. ఆపమని మేము అడగలేదు: CM రేవంత్

బనకచర్ల కడతామని ఏపీ చెప్పలేదు.. ఆపమని మేము అడగలేదు: CM రేవంత్

న్యూఢిల్లీ: ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్ కడతామని ఏపీ చెప్పలేదు.. ఆపమని మేము అడగలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, వాటాలు, అనుమతులు, కొత్త ప్రాజెక్టుల అంశంపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో బుధవారం (జూలై 16) కీలక సమావేశం జరిగింది. 

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఇవాళ్టి సమావేశంలో బనకచర్ల అంశమే చర్చకు రాలేదని.. అసలు అజెండాలోనే బనకచర్ల ప్రాజెక్ట్ లేదన్నారు సీఎం రేవంత్. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వ సంస్థలే అభ్యంతరాలు చెప్పాయని గుర్తు చేశారు. ఇది అపెక్స్ కమిటీ భేటీ కాదని.. ఇన్ఫార్మల్ మీటింగ్ మాత్రమేనన్నారు. ఈ భేటీలో కేంద్రం ఎజెండా ఏం లేదని.. ఒక ప్లాట్‎ఫార్మ్‎లా కేంద్రం సమావేశాన్ని ఏర్పాటు చేసిందని క్లారిటీ ఇచ్చారు. 

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా, గోదావరి జలాల వివాద పరిష్కారం కోసం కమిటీ వేయాలని నిర్ణయించామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర, సాంకేతిక నిపుణులు ఈ కమిటీలో ఉంటారని చెప్పారు. ఆఫీసర్లతో పరిష్కారం కానీ అంశాలపై సీఎంల స్థాయి భేటీలో చర్చిస్తామన్నారు. కొత్త, పాత ప్రాజెక్టులు అంశాలు ఈ కమిటీ ముందుకు చర్చకు వస్తాయని.. కమిటీ సూచనల మేరకు తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

ALSO READ : రిజర్వాయర్ల దగ్గర యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీలు ఏర్పాటు: మంత్రి ఉత్తమ్

ఇవాళ్టి సమావేశంలో మేం చెప్పాల్సిన అభ్యంతరాలన్నీ చెప్పామని.. ఈ భేటీలో టెలిమెట్రీల ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. టెలిమెట్రీలు ఏర్పాటు చేస్తే ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుతుందో తెలిసిపోతుందన్నారు. ఈ మేరకు అన్ని పాయింట్ల వద్ద టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణ హక్కులను మాజీ సీఎం కేసీఆర్ ఏపీకి ధారాదత్తం చేశారని విమర్శించారు.

 తెలంగాణ హక్కులను తిరిగి సాధించుకునేందుకు మేం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గతంలో జరిగిన సమావేశాల్లో ఎలాంటి పరిష్కారం లభించలేదని.. కానీ ఇవాళ్టి సమావేశంలో నాలుగు అంశాలకు పరిష్కారం  దొరికిందని తెలిపారు. కేంద్రం వ్యవహారశైలిపై ప్రస్తుతానికి మాకు ఎలాంటి అనుమానం లేదన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి  వివాదాలు లేకుండా సమస్యల పరిష్కారం చేయాలని మేం ప్రయత్నిస్తున్నామన్నారు.