రిజర్వాయర్ల దగ్గర యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీలు ఏర్పాటు: మంత్రి ఉత్తమ్

రిజర్వాయర్ల దగ్గర యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీలు ఏర్పాటు: మంత్రి ఉత్తమ్

న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి శాఖ సమావేశంలో ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణ జలాల పంపకంపై ప్రధానంగా చర్చించామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, వాటాలు, అనుమతులు, కొత్త ప్రాజెక్టుల అంశంపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో బుధవారం (జూలై 16) కీలక సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హాజరయ్యారు.

 వీరితో పాటు తెలంగాణ, ఏపీ ఇరిగేషన్ మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రామానాయుడు కూడా అటెండ్ అయ్యారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. కృష్ణా నదిపై ఉన్న అన్ని రిజర్వాయర్లపై టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. 

ALSO READ : తెలంగాణకు గోదావరి బోర్డు.. ఏపీకి కృష్ణా బోర్డు: కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయాలు

టెలిమెట్రీలు ఉంటే ఏ రాష్ట్రం ఎంత మేర నీరు వాడుతుందో తెలుస్తుందని చెప్పారు. కృష్ణా నది అన్ని పాయింట్స్ వద్ద యుద్ధప్రాతిపదికన టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టెలిమెట్రీల ఏర్పాటులో నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఏపీకి సూచించిందని చెప్పారు. హైదరాబాద్‎లో గోదావరి బోర్డు, ఏపీలో కృష్ణా బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.