వర్షంలో సీఎం మూడు కిలోమీటర్ల ర్యాలీ.. బీజేపీ పాలిత రాష్ట్రాల తీరుపై దీదీ లాంగ్ మార్చ్..

వర్షంలో సీఎం మూడు కిలోమీటర్ల ర్యాలీ.. బీజేపీ పాలిత రాష్ట్రాల తీరుపై దీదీ లాంగ్ మార్చ్..

ఆమె ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. కనుసైగ చేస్తే అధికార యంత్రాంగం మోకరిల్లుతుంది. అయినప్పటికీ సాధారణ పౌరుల వలె.. మూడు కిలోమీటర్లు నడిచింది. ఒక వైపు వర్షం కురుస్తున్నా.. ఎలాంటి గొడుగు లేకుండా.. అందరిలాగే తడుస్తూ ఒకటి కాదు రెండు కాదు.. మూడు కిలోమీటర్లు ర్యాలీలో ప్రజలతో పాటు నడిచింది. వేల సంఖ్యలో వచ్చిన జనాలకు మార్గదర్శకం చేస్తూ లాంగ్ మార్చ్ చేయడం దేశ రాజకీయ నాయకుల దృష్టిని ఆకర్శించేలా చేసింది. ఏది చేసినా సంచలనంగా ఉండే వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మరోసారి వార్తల్లో నిలిచింది. 

దేశ వ్యాప్తంగా బెంగాలీ ప్రజలను బీజేపీ క్రమక్రమంగా టార్గెట్ చేస్తోందని.. టార్చర్ చేస్తోందని విమర్శిస్తూ మమతాబెనర్జీ బుధవారం (జులై 16) భారీ ర్యాలీ నిర్వహించడం సంచలనంగా మారింది.  బెంగాలీలపై దాడులు ఇలాగే కొనసాగితే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కోల్ కతాలో నిర్వహించిన ఈ ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ నేతలందరూ పాల్గొన్నారు. మొత్తం 15 వందల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 

మూడు కిలోమీటర్ల ర్యాలీలో వర్షంలో తడుస్తూ.. పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు దీదీ. BJP పాలిత రాష్ట్రాలలో బెంగాలీ మాట్లాడే ప్రజలను టార్గెట్ చేసి పంపించాలని కేంద్రం సీక్రెట్ నోటీసులు జారీ చేసినట్లు ఆమె ఆరోపించారు. బెంగాలీ ప్రజలను ఆయా రాష్ట్రాల నుంచి ఎలా పంపిస్తారు.. దీనికి త గిన మూల్యం చెల్లిస్తారని కోల్ కతాలో నిర్వహించిన ర్యాలీలో విమర్శించారు. నేను బెంగాలీ మళ్లీ మళ్లీ మాట్లాడతాను.. దమ్ముంటే నన్ను కూడా జైల్లో పెట్టండి.. అని ఛాలెంజ్ విసిరారు. 

వెస్ట్ బెంగాల్ లో ఓటర్ లిస్ట్ రివిజన్ చేయాలని ఎలక్షన్ కమిషన్ సమాయత్తమవుతున్న తరుణంలో.. దీదీ విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓటర్ లిస్టులో పేరు లేదనీ.. మళ్లీ నమోదు చేసుకోవాలని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని ఎన్నికల కమిషన్ చూస్తోందని.. బీజేపీ చేతిలో పావులా మారిందని విమర్శించారు. 

ఇటీవల ఒడిశా, ఢిల్లీలో బెంగాలీలపై భాష పేరుతో దాడులు జరగటం.. స్వరాష్ట్రాలకు పంపించడం మొదలైన ఘటనలు దీదీ ఆగ్రహానికి కారణమయ్యాయి. ఒడిశాలో ఇటీవల 444 మందిని బంగ్లాదేశీయులుగా అనుమానిస్తూ అదుపులోకి తీసుకున్నారు. అయితే అందులో 200 మంది వెస్ట్ బెంగాల్ పౌరులు ఉన్నారని.. బంగ్లాదేశీయుల నెపంతో బెంగాలీలను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. 

బెంగాల్ పౌరులకు ఐడీ కార్డ్స్ ఉన్నాయి.. వారు చాలా రాష్ట్రాల్లో పని చేస్తున్నారు. వారికి స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా పనిచేస్తారు.. పనిచేయించుకుంటారు.. బెంగాలీలో మాట్లాడితే అరెస్ట్ చేస్తారు.. మీకు ఎవరిచ్చారు ఆ హక్కు.. బెంగాల్ భారత్ లో భాగం కాదా.. అని నిలదీశారు దీదీ. 

ప్రధాని మోదీ పర్యటనకు ఒకరోజు ముందు:

ప్రధాని నరేంద్ర మోదీ వెస్ట్ బెంగాల్ పర్యటనకు వస్తున్న ఒక రోజు ముందు సీఎం మమతా బెనర్జీ ఇంత భారీ ర్యాలీ నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి గ్రౌండ్ లెవల్ లో రూట్ సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. 

వీధుల్లో ధర్నాలు చేసి.. సామాన్యులను ఆకట్టుకోవడం.. మమతాబెనర్జీ స్టైల్. ప్రతిపక్షాలకు, కేంద్రానికి చెప్పాల్సిన విషయం సూటిగా చెప్పేందుకు.. ఢీ అంటే ఢీ అంటూ ఆమె వీధి పోరాటాలకు వెళ్తుంటారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె వీధి పోరాటాలు చాలా ప్రభావం చూపాయి. మరోసారి బెంగాలీ ఆత్మగౌరవ పోరాటం పేరుతో ఆమె రోడ్లెక్కడం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునేనని విశ్లేషకులు అంటున్నారు.