
ఇటీవల కాలంలో వివాహబంధంపై నమ్మకం సన్నగిల్లేలా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కారణాలేమైనా కానీ.. ఎక్కువ సందర్భాల్లో బలవుతోంది భర్తలే... వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనో, ఇష్టం లేని పెళ్లి చేసారనో, ఆస్థి కోసమో.. ఇలా కారణం ఏదైనా కానీ.. భర్తలను చంపడానికి ఏ మాత్రం వెనుకాడటంలేదు నేటి మహిళలు. ఏపీలోని తాడేపల్లిలో భర్య వేధింపులు తాళలేక మరో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న బాధితుడు తన చావుకు భార్య వేధింపులే కారణమని పేర్కొన్నాడు. బుధవారం ( జులై 16 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
తాడేపల్లి మండలం నులకపేటకు చెందిన బ్రహ్మయ్యకు మంగళగిరికి చెందిన మోహన కౌసల్యకు గత ఏడాది ఆగస్టు 18న వివాహం అయ్యింది. బ్రహ్మయ్య తల్లిదండ్రులతో కలిసి ఉన్నారు నవదంపతులు. ఈ క్రమంలో వేరు కాపురం ఉందామంటూ భర్తపై ఒత్తిడి తెచ్చింది భార్య మోహన కౌసల్య. దీంతో ఉండవల్లిలోని సాయిబాబా గుడి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు బ్రహ్మయ్య దంపతులు. ఆషాడ మాసం కావడంతో పుట్టింటికి వెళ్ళింది భార్య కౌసల్య.
ఏం జరిగిందో కానీ.. ఇవాళ ఉదయం ఉండవల్లిలో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు బ్రహ్మయ్య. సెల్ఫీ వీడియో తీసుకుంటూ తన చావుకు భార్యే కారణమని వీడియో పేర్కొన్నాడు బ్రహ్మయ్య. తమ కొడుకు చావుకు కోడలే కారణమని ఆరోపిస్తున్నారు బ్రహ్మయ్య తల్లిదండ్రులు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు తాడేపల్లి పోలీసులు.