కాళేశ్వరం వరల్డ్ వండర్ కాదు.. వరల్డ్ బ్లండర్ : కృష్ణ ప్రసాద్

కాళేశ్వరం వరల్డ్ వండర్ కాదు.. వరల్డ్ బ్లండర్ : కృష్ణ ప్రసాద్

హైదరాబాద్, వెలుగు :  కాళేశ్వరం ప్రాజెక్ట్ వరల్డ్ వండర్ కాదని, వరల్డ్ బ్లండర్ అని బీజేపీ అధికార ప్రతినిధి, రిటైర్డ్‌‌ ఐపీఎస్ కృష్ణప్రసాద్ ఆరోపించారు. ఒక్క కుటుంబం కమీషన్ల కోసమే కాళేశ్వరం నిర్మించిందని మండిపడ్డారు. ఐదేండ్లు కాకముందే ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిందన్నారు. రూ.30 వేల కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ ను రూ.1.30 లక్షల కోట్లకు పెంచారని మండిపడ్డారు. ప్రజాధనం మొత్తం వృథా అయిందని విమర్శించారు. బుధవారం సోమాజిగూడ లోని బీజేపీ మీడియా పాయింట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేసిన ఇంజినీర్​లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 40 డిజైన్లతో చేసిన ప్రాజెక్ట్ కాదని.. ఫాల్ట్ ఎస్టిమేట్, ఫాల్ట్ డిజైన్ తో చేసిన ప్రాజెక్ట్ అని మండిపడ్డారు. సాగు నీళ్లు ఇస్తామంటూ లక్ష కోట్ల నిధులు మింగేసి తెలంగాణ రైతులను మోసం చేశారన్నారు. కాళేశ్వరం ద్వారా నలభై లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్నారని, కానీ.. పది లక్షల ఎకరాలకైనా నీరు ఇచ్చారా అని ప్రశ్నించారు. 

మేడిగడ్డ పిల్లర్లు కుంగడంతో పది టీఎంసీల నీళ్లు వృథాగా వదిలేశారన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో నీళ్లు లేవని, ఎప్పుడు రిపేర్ చేసి.. ఎలా నీళ్లు నింపుతారని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు దీనిపై స్పందించడం లేదన్నారు.