
- కాళేశ్వరంపై విచారణ స్పీడప్
- ఇవాళ ఇంజినీర్లతో జస్టిస్ పీసీ ఘోష్ భేటీ
- నేడో రేపో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ రావు విచారణ?
- గొర్రెల స్కాం నిందితులు ఏసీబీ కస్టడీకి
- తలసాని మాజీ ఓఎస్డీకీ కస్టడీ విచారణ
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ కోసం వెయిటింగ్
- జూన్ 16న రాష్ట్రానికి ప్రభాకర్ రావు
- తెరలు తొలగిపోతే దోషులుగా తేలేదెవరో..?
మూడు కుంభకోణాలు గత పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కాళేశ్వరంపై ఏర్పాటైన రిటైర్డ్ జడ్జి పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ జలసౌధలో ఇంజినీర్ల నుంచి వివరాలు సేకరిస్తోంది. నేడో రేపో అప్పటి ఈఎన్సీ మురళీధర్ రావును విచారించేందుకు రెడీ అవుతోంది. 2.10 కోట్ల తో మొదలైన గొర్రెల స్కాం వ్యవహారం కాస్తా 700 కోట్ల కుంభకోణం దాకా వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో అప్పటి మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్ కుమార్ తోపాటు అప్పటి పశుసంవర్ధకశాఖ ఎండీ రామ్ చందర్ నాయక్ ను ఇవాళ ఏసీబీ కస్టడీలోకి తీసుకొని మూడు రోజుల పాటు విచారించనుంది. వీళ్లు ఇచ్చే స్టేట్ మెంట్ కీలకంగా మారింది. మరో వైపు రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు ఈ నెల 16న రాష్ట్రానికి రానున్నారు. ఆయనను విచారిస్తే అసలు దోషులెవరో తేలిపోనుంది. అతి తొందరలోనే మూడు స్కాంలలో ప్రధాన నిందితులెవరో తేలిపోయే అవకాశం ఉంది.
కాళేశ్వరం
కాళేశ్వరం స్కాంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ జలసౌధలో ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా ఉన్న ఇంజినీర్లను విచారిస్తోంది. ఇప్పటికే కీలక సమాచారాన్ని రాబట్టిన కమిషన్ త్వరలో దోషులెవరో తేల్చేందుకు సిద్ధమవుతోంది.
గొర్రెల స్కాం
బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీలో చోటు చేసుకున్న కుంభకోణంలో అవినీతి తవ్వినకొద్దీ బయటికి వస్తోంది. ఈ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరు అధికారులను కోర్టు మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి ఇచ్చింది. వాళ్ల స్టేట్ మెంట్ల ఆధారంగా దోషులెవరో తేల్చనుంది.
ఫోన్ ట్యాపింగ్
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతంమైంది. అనధికారికంగా విదేశాల నుంచి పరికరాలు తీసుకొచ్చి ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూన్ 16న రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన ఇచ్చే స్టేట్ మెంట్ కీలక మారనుంది. దాని ఆధారంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశంది.
మూడు స్కాంలలో విచారణ వేగవంతమైంది. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన కాళేశ్వరం కేసులో జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారణ జరుపుతోంది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన కమిషన్ కీలక వివరాలను ఇంజినీర్ల నుంచి సేకరించింది. ప్లానింగ్, నిర్మాణం, పనితీరు, డ్యామేజీకి గల కారణాలపై ఆరా తీసింది. అవసరమైతే అప్పటి సీఎం కేసీఆర్ ను కూడా పిలిచి విచారిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జలసౌధలో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ల నుంచి సమాచారం సేకరించనుంది. రెండు మూడు రోజుల్లో అప్పటి ఇఎన్సీ మురళీధర్ రావును విచారణకు పిలిచేందుకు కమిషన్ రెడీ అవుతోంది.
మూడు రోజుల కస్టడీకి ఇద్దరు
గొర్రెల స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పశు సంవర్ధక శాఖ మాజీ ఎండీ రామ్ చందర్ నాయక్.. తలసాని మాజీ ఓఎస్డీ కల్యాణ్ కుమార్ ను కోర్టు మూడు రోజుల ఏసీబీ కస్టడీ విధించింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఏసీబీ అధికారులు వీళ్లిద్దరినీ విచారించనున్నారు. ప్రాథమికంగా 2.10 కోట్ల రూపాయలు దారి మళ్లినట్టు గుర్తించిన ఏసీబీ.. రామ్ చందర్ నాయక్, కల్యాణ్ అరెస్టు తర్వాత రూ. 700 స్కామ్ జరిగిందనే నిర్ధారణకు వచ్చింది. ఈ కేసులో కాంట్రాక్టర్ మొహినొద్దీన్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే కీలక అంశాలు, తెరవెనుక సూత్రధారులు బయటికి వస్తారని ఏసీబీ భావిస్తోంది. ఈ కుంభకోణం వెనుక ఎవరున్నారు. రాజకీయ ప్రముఖులకు ఏమైనా సంబంధాలున్నాయా..? ఎవరి ప్రోద్బలంతో ఇంత పెద్ద కుంభకోణం జరిగిందనే అంశంపై ఆరా తీయనుంది.
జూన్ 16న రాష్ట్రానికి ప్రభాకర్ రావు
రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి, ఏ1గా ఉన్న అప్పి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ ఈ నెల 16న రాష్ట్రానికి వస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనను రప్పించేందుకు పోలీసు శాఖ రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేసింది. అనారోగ్యం కారణంగా అమెరికాలో చికిత్స పొందుతున్న ప్రభాకర్ రావు రాష్ట్రానికి వస్తే.. ఫోన్ ట్యాపింగ్ కేసు మూలాలకు తెరపడే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, కీలక వ్యాపారులు, సంస్థలు, రియల్టర్లే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఇప్పటికే అరెస్టయిన రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు స్టేట్ మెంట్ల ఆధారంగా తెలుస్తోంది. అయితే ఈ కేసులో కీలక ఆధారాలను, ఎలక్ట్రానిక్ డివైజ్ లను సైతం ధ్వంసం చేసినట్టు ప్రణీత్ రావు తన కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో వెల్లడించారు. ఈ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ పెట్టేందుకు పోలీసులు సిద్ధమైన విషయం తెలిసిందే. అదే జరిగితే తెరవెనుక ఉన్న అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంది.