సర్కారు మారినా రిజైన్ చేయని రిటైర్డ్ ఆఫీసర్లు

సర్కారు మారినా రిజైన్ చేయని రిటైర్డ్ ఆఫీసర్లు
  • రాజీనామా చేసేదిలేదంటున్న ఎక్స్ టెన్షన్​లో ఉన్న అధికారులు
  • ఆర్ అండ్ బీ లో ఎక్స్ టెన్షన్ రద్దు చేయాలని లేఖలు

హైదరాబాద్ ,వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కొన్ని శాఖల్లో ఎక్స్ టెన్షన్​లో ఉన్న, కన్సలెంట్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న రిటైర్డ్ ఆఫీసర్లు మాత్రం రాజీనామా చేయట్లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఇతర పదవుల్లో ఉన్న వారిని తొలగిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ సలహాదారులైన సోమేశ్ కుమార్, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్​తో పాటు పలువురిని తొలగించారు. ఇటీవల ఇరిగేషన్ పై రివ్యూ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిపార్ట్ మెంట్​లో ఉన్న రిటైర్డ్ అధికారులను రాజీనామా చేయాలని ఆదేశించారు. 

ఇరిగేషన్ లో సైతం పలువురు ఈఎన్సీలు రిటైర్ అయినప్పటికీ విధుల్లో కొనసాగుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఎక్స్​టెన్షన్​ అధికారులు మాత్రం ఇంకా కూర్చీలు వీడడం లేదు. ఈ అంశంపై శాఖల ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. మరోవైపు అన్ని శాఖల్లో కీలక పోస్టుల్లో ఉన్న ఎక్స్​టెన్షన్​ అధికారుల లిస్ట్ ఇప్పటికే సీఎంవోకి చేరినట్లు తెలుస్తున్నది. అయితే మంత్రులు తమ శాఖలపై ఇపుడిపుడే రివ్యూలు చేస్తున్నారు. డిపార్ట్ మెంట్ వివరాలు అన్ని తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై సమాచారం తీసుకున్నాక వారిని తొలగిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.

పీఆర్​లో రిజైన్ చేయబోమంటున్న మాజీలు

పంచాయతీరాజ్​లో, రూరల్ డెవలప్​మెంట్, పీఆర్ ఇంజనీరింగ్​లో పలువురు ఉన్నతాధికారులు ప్రభుత్వం మారినా రిజైన్ చేయటంలేదు. ఎన్నో ఏండ్ల కింద రిటైర్ అయినప్పటికీ గత ప్రభుత్వంలో మంత్రుల అండతో కన్సల్టెంట్లుగా ఇతర ఉన్నత హోదాల్లో పనిచేస్తున్నారు. వీరిపై రెగ్యులర్ అధికారులు, ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పంచాయతీ రాజ్​లో రిటైర్ అయిన ఓ డిప్యూటీ కమిషనర్ 2014 నుంచి పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం కీలక బాధ్యతలు ఈయనకే అప్పగించింది. ప్రభుత్వం మారిన తరువాత కూడా ఆయన రిజైన్ చేయకపోవటం పై ఉద్యోగులు, అధికారులు అంతా కలిసి పీఆర్ మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్న. దీనిపై ఆయన స్పందిస్తూ ‘‘నేను రిజైన్ చేయను” అని చెబుతున్నారని ఉద్యోగులు అంటున్నారు. అలాగే, గత ప్రభుత్వంలో మంత్రి ఎన్నో ఏండ్ల కింద రిటైర్ అయిన తన కులం వ్యక్తిని పంచాయతీ రాజ్ ఈఎన్సీగా కొనసాగించారు. ఆయన కూడా ఇంకా రాజీనామా చేయకపోవడంపై ఇతర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు ఈ విషయం మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. త్వరలో అన్ని డిపార్ట్​మెంట్లలో ఉన్న రిటైర్డ్ అధికారులపై సీఎం నిర్ణయం తీసుకుంటారని మంత్రి సీతక్క వారికి చెప్పినట్లు తెలుస్తున్నది.

రిజైన్ చేశామంటున్న ఆర్ అండ్ బీ ఈఎన్సీలు

ఆర్ అండ్ బీ లో ఇద్దరు ఈఎన్సీలు రిటైర్ అయినా గత ప్రభుత్వం అదే పదవుల్లో కొనసాగించింది. ఇటీవల మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు తీసుకునే టైమ్ లో వారు సెక్రటేరియెట్ కు వచ్చారు. ఆ టైమ్ లో మమ్మల్ని రిలీవ్ చేయాలని మంత్రికి లేఖలు అందజేశామని ఓ ఈఎన్సీ మీడియాకు వెల్లడించారు. వారిద్దరి వల్ల చాలా మంది అధికారులు ప్రమోషన్లు రాకుండా రిటైర్ అయ్యారని, వారిని వెంటనే రిలీవ్​ చేయాలని ఆ శాఖ ఉద్యోగులు కోరుతున్నారు.