
- నకిలీ ఎఫ్‌డీ బాండ్లతో 20 కోట్లు కొల్లగొట్టిన సొసైటీ అధ్యక్షుడు, సభ్యులు
హైదరాబాద్, వెలుగు: బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల ఫిక్స్డ్ డిపాజిట్లను కొల్లగొట్టిన కేసులో నల్గొండ జిల్లా బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ సూపరింటెండెంట్ బాషమల్ల అనంతరావు (63)ను సీఐడీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. నల్గొండ వివేకానంద నగర్ కాలనీలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. ఇంట్లో పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరికొంత మంది కోసం గాలిస్తున్నారు. వివరాలను సీఐడీ చీఫ్ శిఖాగోయల్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఎఫ్‌డీలను ఇలా దారి మళ్లించారు
నల్గొండ జిల్లా బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షుడు, కార్యదర్శిగా సీహెచ్ భిక్షం15ఏండ్లు బాధ్యతలు నిర్వహించాడు. భిక్షంతో పాటు మరో ఏడుగురు కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో బీఎస్‌ఎస్‌ఎన్ ఉద్యోగులు, ఎంప్లాయిస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులు పెద్ద మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్లు వసూలు చేశారు. ఇలా సేకరించిన ఎఫ్‌డీలకు సంబంధించిన డబ్బును సొసైటీ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయకుండా నకిలీ బాండ్స్‌తో దారి మళ్లించారు. ఇలా నకిలీ బాండ్లను జారీ చేసి రూ.20 కోట్లు దుర్వినియోగం చేశారు. ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అకౌంట్లలో ఉండాల్సిన ఎఫ్‌డీలు రూ.20 కోట్లు దారిమళ్లిన విషయం 2022 ఏప్రిల్ 30న వెలుగులోకి వచ్చింది.
ఆడిట్ రిపోర్టుతో సీఐడీ దర్యాప్తు
బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు, సొసైటీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో నల్గొండ జిల్లా కోఆపరేటివ్ కార్యాలయ డిప్యూటీ రిజిస్ట్రార్, ఆడిట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఆడిట్ నిర్వహించారు. నకిలీ బాండ్లతో ఎఫ్‌డీలు కొల్లగొట్టినట్లు ఆడిట్‌లో బయటపడింది. డిప్యూటీ రిజిస్ట్రార్ ఆడిట్ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు భిక్షం సహా పలువురిని గతంలోనే అరెస్ట్ చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ సూపరింటెండెంట్ బాషమల్ల అనంతరావు పాత్ర కూడా సీఐడీ దర్యాప్తులో వెలుగు చూసింది. దీంతో నల్గొండలోని ఆయన నివాసంలో మంగళవారం సోదాలు జరిపి అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు.