
- అమిత్ షా కామెంట్లను ఖండించిన సుప్రీం, హైకోర్టు రిటైర్డ్ జడ్జీలు
- తీర్పు చదివి కామెంట్స్ చేస్తే బాగుండేది
- రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు
- తీర్పులో నక్సలిజాన్ని సమర్థించినట్లు ఎక్కడా లేదు
- జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై చేసిన కామెంట్లను ఖండిస్తున్నం
- అమిత్ షాకు 18 మంది రిటైర్డ్ జడ్జీల లేఖ
న్యూఢిల్లీ, వెలుగు: సల్వాజడుం రద్దు కేసులో సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించి మాట్లాడటం సరికాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ముందుగా చదివి కామెంట్స్ చేస్తే బాగుండేదని హితవు పలికారు. వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు 18 మంది రిటైర్డ్ జడ్జీలు సోమవారం అమిత్ షాకు లేఖ రాశారు.
‘‘ ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి నక్సలైట్లకు మద్దతుదారుడు’’ అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రిటైర్డ్ జడ్జీలు తప్పుబట్టారు. రాజ్యాంగబద్ధమైన పదవి కోసం పోటీపడుతున్న వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని తెలిపారు. అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు.. సుప్రీంకోర్టు మాజీ జడ్జిలు జస్టిస్ ఏకే.పట్నాయక్, అబ్బయ్ ఓకా, గోపాల గౌడ, విక్రమ్‌జిత్ సేన్, కురియన్ జోసెఫ్, మదన్ లోకూర్, జే.చలమేశ్వర్, హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు గోవింద్ మథూర్, ఎస్.మురళీధర్, సంజీవ్ బెనర్జీ, పలు హైకోర్టుల మాజీ జడ్జిలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ ప్రకటనపై మాజీ జడ్జీలంతా సంతకం చేసి మీడియాకు అందజేశారు.
నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు లేదు
‘‘సల్వాజుడం’తీర్పుపై బహిరంగంగా అమిత్ షా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ‘సల్వాజుడం’ రద్దు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరించి మాట్లాడటం సరికాదు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. ఆ తీర్పులో నక్సలిజాన్ని గానీ, దాని భావజాలాన్ని గానీ.. ఎక్కడా సమర్థించినట్లు లేదు’అని రిటైర్డ్ జడ్జీలు లేఖలో పేర్కొన్నారు.
ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి తరఫున ప్రచారం కోసం అమిత్ షా అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. ‘‘ఉపరాష్ట్రపతి ఎన్నికలు గౌరవప్రదంగా, భావజాల కేంద్రీకృతంగా జరగాలి. ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య జరగవు. అయినప్పటికీ అత్యున్నత పదవిలో ఉన్న హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు దేశ న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉన్నాయి. ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనా ప్రభావం పడుతుంది.
ఇకనైనా ఉపరాష్ట్రపతి ఎన్నికను గౌరవప్రదంగా భావించాలి. వ్యక్తిగత దూషణలు, పేరుపెట్టి అవమానించడం వంటి అసభ్య రాజకీయాలకు చోటు ఉండకూడదు’’అని రిటైర్డ్ జడ్జీలు అమిత్‌షాకు హితవు పలికారు.