ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఇవ్వడం లేటైతే... బ్యాంకులపై  రోజుకి రూ. 5 వేలు పెనాల్టీ

ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఇవ్వడం లేటైతే... బ్యాంకులపై  రోజుకి రూ. 5 వేలు పెనాల్టీ

ముంబై : అప్పులు తిరిగి చెల్లించిన తర్వాత బారోవర్లకు వారి ప్రాపర్టీ డాక్యుమెంట్లు వెనక్కి ఇవ్వడంలో లేట్​ చేస్తే బ్యాంకులపై రోజుకి రూ. 5 వేల చొప్పున పెనాల్టీ విధించనున్నట్లు రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) ఆదేశాలు జారీ చేసింది. అప్పు కట్టేశాక డాక్యుమెంట్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని బారోవర్లు  బ్యాంకులపై ఫిర్యాదులు చేయడంతో ఆర్​బీఐ యాక్షన్​కి దిగుతోంది. అప్పు మొత్తం తిరిగొచ్చాక బారోవర్లకు చెందిన  మూవబుల్​ లేదా ఇమ్మూవబుల్​ ప్రాపర్టీల డాక్యుమెంట్లను వెంటనే రిలీజ్​ చేయమని చెబుతూ బుధవారం  ఆర్​బీఐ ఆదేశాలు ఇష్యూ చేసింది.

బారోవర్లకు ప్రయోజనం..

లోన్లు చెల్లించేశాక వెంటనే ప్రాపర్టీ డాక్యుమెంట్లను బ్యాంకులు వెనక్కి ఇవ్వాలనే ఆర్​బీఐ ఆదేశాల వల్ల బారోవర్లకు ఉపశమనం కలుగుతుందని ఇన్వెస్ట్​మెంట్ అడ్వైజర్​, స్టేబుల్​ ఇన్వెస్టర్​ ఫౌండర్​ దేవ్​ ఆశిష్​ చెప్పారు. అప్పులు తిరిగి చెల్లించాక కూడా డాక్యుమెంట్లను అందుకోవడానికి బ్యాంకుల చుట్టూ బారోవర్లు కాళ్లు అరిగేలా తిరగాల్సి రావడం అన్యాయమని పేర్కొన్నారు. 

అన్ని బ్యాంకులకూ ఇదే రూల్​..

దేశంలోని అన్ని బ్యాంకులకు అంటే,  కమర్షియల్​ బ్యాంకులు, స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంకులు, రీజినల్​ రూరల్​ బ్యాంకులు, ప్రైమరీ అర్బన్​ కో–ఆపరేటివ్​ బ్యాంకులు, స్టేట్​ కో–ఆపరేటివ్​ బ్యాంకులు, డిస్ట్రిక్ట్​ సెంట్రల్​ కో–ఆపరేటివ్​ బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు, అసెట్​ రీకన్​స్ట్రక్షన్​ కంపెనీలకూ ఈ రూల్​ వర్తిస్తుందని ఆర్​బీఐ స్పష్టం చేసింది. ఈ ఏడాది డిసెంబర్​ 1 నుంచి కొత్త రూల్ ​అమలులోకి వస్తుందని వెల్లడించింది.

30 రోజుల్లోనే ఒరిజినల్​ డాక్యుమెంట్లు వెనక్కి ఇవ్వాలి..

బారోవర్లు అప్పులు తిరిగి చెల్లించేసిన 30 రోజులలోపు తనఖా తొలగించి, ఒరిజినల్​ ప్రాపర్టీ డాక్యుమెంట్లను బ్యాంకులు లేదా ఎన్​బీఎఫ్​సీలు వెనక్కి ఇవ్వాలని ఆర్​బీఐ ఆదేశించింది. లోన్​క్లోజర్​ అంశంపై బారోవర్లు చాలా మంది దృష్టి పెట్టరని డిజిటల్​ లెండింగ్​ కన్సల్టెంట్​ పారిజాత్​ గర్గ్​ చెప్పారు. ఆర్​బీఐ తాజా ఆదేశాలతో ఇప్పుడు అందరూ దీనిపై ఫోకస్​ పెడతారని పేర్కొన్నారు. డిసెంబర్​ 1 తర్వాత  వెనక్కి ఇవ్వాల్సిన ప్రాపర్టీ డాక్యుమెంట్లన్నింటికీ ఈ కొత్త రూల్​ వర్తించనుంది.

ALSO READ: సమస్యలపై పట్టింపేది..? వాడీవేడిగా జడ్పీ జనరల్​బాడీ మీటింగ్

డాక్యుమెంట్లు ఎక్కడి నుంచి వెనక్కి తీసుకోవాలి..

అప్పు ఇచ్చిన బ్యాంక్​ బ్రాంచీ నుంచి ఒరిజినల్​ ప్రాపర్టీ డాక్యుమెంట్లను బారోవర్లు  వెనక్కి తీసుకోవచ్చు. లేదంటే, ఆ బ్యాంకుకు సంబంధించిన వేరే ఏదైనా ఆఫీసులో ఆ డాక్యుమెంట్లు ఉంటే అక్కడి నుంచైనా బారోవర్లు వెనక్కి పొందవచ్చు. డిసెంబర్​1 తర్వాత నుంచి శాంక్షనయ్యే లోన్ల విషయంలో శాంక్షన్​ లెటర్లలోనే డాక్యుమెంట్లను ఎప్పుడు, ఎలా తీసుకోవచ్చో తప్పనిసరిగా చెప్పాలని కూడా ఆర్​బీఐ ఆదేశించింది.

డాక్యుమెంట్లు ఇవ్వకపోతే పరిహారం..

లోన్​ మొత్తాన్ని తిరిగి చెల్లించిన తర్వాత 30 రోజులలో డాక్యుమెంట్లను వెనక్కి ఇవ్వకపోతే, ఆ ఆలస్యానికి కారణాలేమిటో బారోవర్లకు బ్యాంకులు తెలియచెప్పాల్సి ఉంటుందని ఆర్​బీఐ తాజా ఆదేశాలలో స్పష్టం చేసింది. ఒకవేళ బ్యాంకు తప్పువల్లే ఆలస్యం జరిగితే బారోవర్లకు రోజుకి రూ. 5 వేల చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆర్​బీఐ పేర్కొంది. పెనాల్టీ స్పష్టంగా పేర్కొనడం వల్ల బ్యాంకులలో జవాబుదారీతనం పెరుగుతుందని ఆశిష్​ చెప్పారు.

ఒరిజినల్​ డాక్యుమెంట్లు డ్యామేజైతే..

ఒకవేళ ఒరిజినల్​ డాక్యుమెంట్లకు ఏదైనా డ్యామేజ్​ జరిగినా లేదా అవి పోయినా ....డూప్లికేట్​ కాపీలు పొందడంలో బారోవర్లకు లెండర్లు సాయపడాలని, అందుకయ్యే ఖర్చును సైతం భరించాలని ఆర్​బీఐ స్పష్టం చేసింది. దీనికి అదనంగా రోజుకి రూ. 5 వేల చొప్పున కాంపెన్సేషన్​ చెల్లించాలని పేర్కొంది. అయితే, ఇలాంటి సందర్భాలలో బ్యాంకులకు 30 రోజులు కాకుండా మరో 30 రోజులు అంటే మొత్తం 60 రోజులు గడువు ఇవ్వనున్నట్లు ఆర్​బీఐ తెలిపింది. మరోవిధంగా చెప్పాలంటే, డిలేడ్​ పీరియడ్​ పెనాల్టీ 60 రోజుల తర్వాత నుంచి బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుందన్న మాట.