రేవంత్, పొంగులేటిది ఫెవికాల్ బంధం.. వాళ్ల భూ కుంభకోణాన్ని త్వరలో బయటపెడ్త: హరీశ్

రేవంత్, పొంగులేటిది ఫెవికాల్ బంధం.. వాళ్ల భూ కుంభకోణాన్ని త్వరలో బయటపెడ్త: హరీశ్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది ఫెవికాల్ బంధమని బీఆర్‌‌‌‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. వాళ్లిద్దరి భూ కుంభకోణాన్ని ఆధారాలతో త్వరలో బయటపెడతానని చెప్పారు. కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికే ఇచ్చారని, మూసీ సుందరీకరణ టెండర్ కూడా ఆయనకే ఇస్తున్నారని ఆరోపించారు. 

రాష్ట్రంలో భూముల సెటిల్‌‌మెంట్‌‌లో రేవంత్ రెడ్డికి, పొంగులేటికి మధ్య వాటా బంధాలు ఉన్నాయని ఆరోపించారు. కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని, సెటిల్‌‌మెంట్ అయితే క్లియర్ చేస్తున్నారు, లేకపోతే బెదిరిస్తున్నారన్నారు. సభ నుంచి బీఆర్‌‌‌‌ఎస్ సభ్యులను సస్పెండ్ చేయడంపై ఆదివారం తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

రాఘవ కన్‌‌స్ట్రక్షన్స్ అవినీతికి పాల్పడిందని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారని, అందుకే డిఫెన్స్‌‌లో పడిపోయి డైవర్షన్ పాలిటిక్స్‌‌కు చేస్తున్నారని మండిపడ్డారు. రాఘవ కన్‌‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌‌పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తే.. దళితులపై రాజకీయం చేశారని విమర్శించారు. 

ప్రభుత్వ అవినీతిని తమ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి ప్రశ్నిస్తున్నాడు కాబట్టే.. ఆయనపై కావాలని ప్రభుత్వం దాడి చేస్తున్నదని, అది ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనన్నారు. భడివె అని మాట్లాడిన సీఎంపైనా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి తప్పు చేస్తే సీబీసీఐడీ విచారణ న్యాయంగా జరుగుతుందా అని ప్రశ్నించారు. అందుకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశామన్నారు.

మేం హౌస్ కమిటీ డిమాండ్ చేస్తే తప్పా..
పార్లమెంట్‌‌లో జాయింట్ హౌస్ కమిటీ వేయాలని ఎన్నోసార్లు పార్లమెంట్‌‌లో రాహుల్ గాంధీ కొట్లాడారని, ఆయన మాట్లాడితే తప్పు లేదుగానీ తాము డిమాండ్ చేస్తే తప్పా అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఓబుళాపురం మైనింగ్‌‌పై హౌస్​ కమిటీ వేశారు కదా.. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్‌‌పై హౌస్ కమిటీ వేస్తే తప్పేంటని ప్రశ్నించారు.

మంత్రి పొంగులేటి విషయం బయటపడగానే తనపై బురదజల్లే ప్రయత్నం చేశారని హరీశ్ అన్నారు. తన తమ్ముడు, తన బావమరిది పేర్లు తీసుకుంటూ ఆరోపణలు చేశారన్నారు. రేవంత్ రెడ్డి తమ్ముళ్లు, బావలు చేసిన కుంభకోణాలపై విచారణకు రెడీ అయితే, తన కుటుంబసభ్యులపై వచ్చిన ఆరోపణలపై విచారణకు తాను కూడా రెడీ అని హరీశ్‌‌ సవాల్ విసిరారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిద్దామని, సీఎం రేవంత్‌‌ సిద్ధమా అని సవాల్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 20 కుంభకోణాలు జరిగాయని, వాటిపై విచారణ జరిగేదాకా వదిలే ప్రసక్తే లేదన్నారు.