
తన భార్యను అభ్యర్థిగా ప్రకటించిన ఉత్తమ్
ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారన్న రేవంత్
ఉత్తమ్‌కు షోకాజ్ ఇవ్వాలని కుంతియాకు ఫిర్యాదు
తలో దిక్కు చీలిపోయిన కోమటిరెడ్డి బ్రదర్స్
మా జిల్లాలో బయటోళ్ల పెత్తనమేంది?: వెంకట్‌రెడ్డి
ఉత్తమ్ కాదు హైకమాండ్‌దే నిర్ణయం: రాజ్‌గోపాల్‌రెడ్డి
పార్టీలో ఇలాంటివి కామన్: జగ్గారెడ్డి
రేవంత్‌పై హైకమాండ్‌కు క్రమశిక్షణ కమిటీ ఫిర్యాదు?
హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. త్వరలో జరుగనున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నిక నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఆ స్థానానికి పార్టీ అభ్యర్థిగా తన భార్య పద్మావతి పేరును పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. దీన్ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీలో చర్చించకుండా అభ్యర్థిని ఎలా ఏకపక్షంగా ప్రకటిస్తారని ఆయన మండిపడ్డారు. ఉత్తమ్ ప్రకటనను కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి తప్పుబట్టారు. ఆయన అన్న, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం.. తమ జిల్లా వ్యవహారంలో వేరే జిల్లాల నేతల పెత్తనం అవసరం లేదంటూ పరోక్షంగా రేవంత్ తీరును తప్పుబట్టారు. పార్టీలో గివన్నీ కామన్ అని, సీనియర్స్ మధ్య ఉన్న విభేదాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కలిసి ఉప ఎన్నికను ఎదుర్కోవాల్సిన సమయంలో కీలక నేతలే ఇలా బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడం ఏమిటని పార్టీ కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘‘కాంగ్రెస్‌లో ఫ్రీడం ఉంటుంది. కాకపోతే అది ఇప్పుడు మోతాదుకు మించింది. డోస్ ఎక్కువై పార్టీ ఖతమయ్యే పరిస్థితి వచ్చింది’’ అని ఓ సీనియర్ నేత అన్నారు.
ఇట్ల షురూ..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పీసీసీ చీఫ్ ఉత్తమ్.. అటు తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగా గెలిచారు. దీంతో ఎమ్మెల్యే స్థానానికి ఆయన రాజీనామా చేయడంతో త్వరలో ఉప ఎన్నిక జరిపేందుకు ఈసీ సిద్ధమవుతోంది.
ఈ క్రమంలో ఇటీవల సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో కార్యకర్తల సమావేశంలో.. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో తన భార్య పద్మావతి పోటీ చేస్తారని ఉత్తమ్ ప్రకటించారు. అలా ప్రకటించారో లేదో.. ఇలా పార్టీలో దుమారం చెలరేగింది. ఉత్తమ్ ఈ ప్రకటన చేసిన రెండు రోజులకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియాను కలిశారు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించే అధికారం ఏఐసీసీకి మాత్రమే ఉంటుందని, ఆ నిర్ణయం ఢిల్లీలో జరుగుతుందని, ఉత్తమ్ మాత్రం ఎలా నిర్ణయిస్తారని రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రకటన చేసిన ఉత్తమ్‌కు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని కుంతియాకు ఆయన ఫిర్యాదు చేశారు. ఉత్తమ్ వ్యవహారంపై ఆయన ఢిల్లీలో హైకమాండ్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాను ఉత్తమ్ స్వగ్రామానికే చెందిన చామల కిరణ్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా బలపరుస్తున్నానని రేవంత్ ప్రకటించారు. బుధవారం అసెంబ్లీకి వచ్చి మీడియా ముందు కూడా ఉత్తమ్ తీరును తప్పుబట్టారు. పార్టీకి చెందిన పలువురు నేతలతో ఆయన మంతనాలు సాగించారు. అసెంబ్లీలో కీలకమైన విద్యుత్ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గవర్నర్‌ను పీసీసీ కలిసేందుకు వెళ్లినప్పుడు కూడా తనను పిలువకపోవడం ఏమిటని, తాను కూడా పీసీసీలో సభ్యుడినేనని పేర్కొన్నారు. రేవంత్ ఇలా మాట్లాడారో లేదో.. అటు హుజూర్‌నగర్‌లో స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయనకు వ్యతిరేకంగా ప్రెస్మీట్లు పెట్టి, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ తలో దారి
హుజూర్‌నగర్ వ్యవహారంలో కోమటిరెడ్డి బ్రదర్స్ తలో వైపు నిలిచారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి బుధవారం అసెంబ్లీ లాబీల్లో ఉత్తమ్, కుంతియాను విమర్శించారు. గురువారం ఆయన అన్న, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీకి వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. హుజూర్‌నగర్ క్యాండిడేట్‌గా పద్మావతినే కరెక్ట్ అని, ఆమెను గెలిపించుకుంటామన్నారు. ‘‘కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లకు నల్గొండలో ఏం పని? మా జిల్లాలో ఉత్తమ్, జానారెడ్డి, దామోదర్‌రెడ్డి 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. జిల్లాలో మేము సీనియర్లుగా ఉన్నాం. మేమంతా మాట్లాడుకుంటాం. ఇంకొకరి పెత్తనం అవసరం లేదు’’అని పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘పీసీసీ చీఫ్ రేస్‌లో ఉన్నది నేనే. నాకు పదవి వచ్చినా, రాకున్నా పార్టీ కోసం పనిచేస్త. కేసీఆర్ అన్న బిడ్డ బీజేపీలో ఉన్నది. ఎవరికి నచ్చిన పార్టీలో వారుంటారు. మా తమ్ముడి గురించి ఆయన్నే అడగండి”అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి హుజూర్‌నగర్‌కు ప్రతిపాదించిన కిరణ్‌రెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని ఆయన అన్నారు. దీనికి రాజ్‌గోపాల్ రెడ్డి సాయంత్రమే మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీల్లో అభ్యర్థులను జిల్లా నాయకులు ప్రకటిస్తారని, జాతీయ పార్టీల్లో జాతీయ నాయకత్వమే అభ్యర్థుల్ని ఎంపిక చేస్తుందని పరోక్షంగా ఉత్తమ్ తీరును వ్యతిరేకించారు. ఈ మొత్తం వ్యవహారం చూసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి తమ పార్టీలో ఇలాంటివి కామన్ అని, సీనియర్స్ మధ్య ఉన్న విభేదాలతో ఇవన్నీ బయటకు వస్తున్నాయని అన్నారు. కాకపోతే పార్టీ వేదికలపై మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. పార్టీలో పెద్ద నేతల వ్యవహారంపై ఇతర నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘19 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఉత్తమ్ కుమార్ వారిని కాపాడుకోలేకపోయిండు. 12 మంది పార్టీ ఫిరాయించిన్రు. వాళ్లని ఆపలేకపోయిండు. అలాంటాయనకు ఇంకా ఎందుకు ఆరాటం తన భార్యనే పోటీ చేయించాలని?’’ అని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ఒకరు ప్రశ్నించారు. కుటుంబ పార్టీ అంటూ కేసీఆర్‌ను తిడుతూ తామే కుటుంబ సభ్యులకు టికెట్ దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయో ఆలోచించుకోవాలని సూచించారు. బయట వ్యక్తికి టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే పార్టీకి గౌరవం దక్కుతుంది కదా అని సదరు నేత అన్నారు. ఏదైనా ఎన్నిక వస్తే అందరూ కలిసి పని చేసి పార్టీని గెలిపించాల్సిన నేతలు ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడాన్ని ద్వితీయ శ్రేణి నేతలు, పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ‘‘ఎంత తండ్లాడనా లాభం లేకుండా పోతున్నది. ఒకోళ్లు ఇటు లాగితే, ఇంకోళ్లు అటు లాగుతున్నరు. పార్టీ బాగుపడ్తదని నమ్మకం పోతున్నది’’ అంటూ కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు ఆవేదన వెలిబుచ్చారు.
పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు.. నేతల మధ్య మాటలు
పీసీసీ చీఫ్ మార్పు ఉండొచ్చని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆ పదవి కోసం తనవంతు ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. ఈ వార్తలు ఇటీవల మీడియాలో వచ్చినప్పుడు అవి రేవంత్ ఇచ్చిన లీకులుగా భావించి రాష్ట్రంలోని కొందరు కాంగ్రెస్ పెద్దలు హైకమాండ్ దగ్గర ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆయనకు పదవి ఇస్తే తాము ఊరుకునేది లేదని వారు హెచ్చరించినట్లు తెలిసింది. వీరి ఫిర్యాదు వల్లే.. రేవంత్‌కు గడప దాకా వచ్చిన పదవి వెనక్కిపోయిందని ఆయన అనుచరులు అంటున్నారు. దీనిపై రేవంత్ కూడా సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీకి వచ్చి ఉత్తమ్‌కు వ్యతిరేకంగా మీడియాతో మాట్లాడటం, కుంతియాకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు పీసీసీ చీఫ్ పదవి కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేసులో తాను ఉన్నానని, ఆ పదవి వచ్చినా రాకపోయినా పార్టీ కోసం పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కొందరు ఉత్తమ్‌ను తప్పుబడితే.. మరికొందరు రేవంత్‌దే రాంగ్ అంటున్నారు.
రేవంత్‌పై హైకమాండ్‌కు ఫిర్యాదు?
పీసీసీ చీఫ్ ఉత్తమ్‌పై ఎంపీ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏ విధంగా వ్యవహరించాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై గురువారం గాంధీభవన్‌లో జరిగిన క్రమశిక్షణ కమిటీ భేటీలో నేతలు చాలా సేపు చర్చించినట్లు సమాచారం. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కమిటీ నేతలంతా ఒకరొకరుగా తమ అభిప్రాయాలను వివరించారు. రేవంత్‌పై పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, న్యూస్ పేపర్ క్లిప్పింగులను సేకరించాలని కమిటీ నిర్ణయానికి వచ్చిందని సమాచారం. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను సేకరించిన అనంతరం క్రమశిక్షణ కమిటీ మరోసారి సమావేశమై.. స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.