రేవంత్, కేసీఆరే బ్యాడ్ బ్రదర్స్.. వీళ్లకు అసదుద్దీన్ తోడైండు: కిషన్రెడ్డి

రేవంత్, కేసీఆరే బ్యాడ్ బ్రదర్స్.. వీళ్లకు అసదుద్దీన్ తోడైండు: కిషన్రెడ్డి
  • రేవంత్, కేసీఆరే బ్యాడ్​ బ్రదర్స్.. వీళ్లకు అసదుద్దీన్ ​తోడైండు 
  • ఫోన్ ట్యాపింగ్ కేసు, విద్యుత్ కొనుగోళ్ల కేసు, భూముల కేసులు ఏమైనయ్​?
  • నెలరోజులుగా రాష్ట్రంలో పాలన బందైంది
  • మంత్రులంతా సెక్రటేరియెట్​కు తాళాలు వేసి జూబ్లీహిల్స్​ గల్లీల్లో తిరుగుతున్నరు
  • హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. రేవంత్​, కేసీఆర్​ రావాలని సవాల్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసలు ఆట ఇంకా మొదలు కాలేదని, బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘‘కాంగ్రెస్ చేసిన పనులు ఏమిటో ప్రజలు తెలుసుకుంటున్నరు. ఆట మొదలుపెట్టినప్పుడు మా సత్తా తెలుస్తుంది. త్వరలో ఆట మొదలుపెడ్తం. అప్పుడు బీఆర్‌‌‌‌ఎస్, కాంగ్రెస్ నేతల కింద  భూమి కదులుతుంది. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తం” అని ఆయన  తెలిపారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో కిషన్​రెడ్డి మాట్లాడారు.

‘‘జూబ్లీహిల్స్​లో కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతో సీఎం సోయి తప్పి మాట్లాడ్తున్నడు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు తాను చేసిందేమిటో వివరించి, ప్రత్యర్థిని విమర్శిస్తూ ఓట్లు అడగాలి. కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మీద ఒక్క మాట కూడా రేవంత్​ మాట్లాడలేదు” అని దుయ్యబట్టారు.  ప్రజల్లో కాంగ్రెస్​పై వ్యతిరేకత ఉందని, దీన్ని మళ్లించే వ్యూహంలో భాగంగానే తమపై, ప్రధానిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.

బ్యాడ్ బ్రదర్స్​ రేవంత్, కేసీఆరే!
“కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నడు. ఎవరు ఎవరికి బ్రదర్స్ ..? కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను కాపాడుతున్నది కాంగ్రెస్  కాదా? తెలంగాణలో బ్యాడ్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి, కేసీఆరే. వారికి అసదుద్దీన్​ ఒవైసీ తోడైండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫేక్, ఫెయిల్యూర్ సర్కార్​” అని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి విమర్శించారు. గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం కూడా ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్, ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్  సర్కార్​ను ఎద్దేవా చేశారు. ‘‘తెరచాటు రాజకీయాలు చేయడంలో కేసీఆర్, -రేవంత్ దిట్టలు. 

రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్. రేవంత్ రెడ్డి మజ్లిస్ పార్టీతో తప్ప అన్ని పార్టీలలో పనిచేసిండు. అలా పార్టీలు మార్చే బుద్ధి మాకు లేదు” అని వ్యాఖ్యానించారు. ‘‘నెలరోజులుగా రాష్ట్రంలో పాలన బందైంది.  మంత్రులు సెక్రటేరియెట్​కు తాళాలు వేసి జూబ్లీహిల్స్​ గల్లీల్లో తిరుగుతున్నరు. అంగట్లో సరుకు కొన్నట్లుగా జూబ్లీహిల్స్​లో ఓట్లు కొనుగోలు చేస్తున్నరు” అని ఆయన ఆరోపించారు.

ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను సర్కారు స్వాధీనం చేసుకుంటున్న సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం అందించిన కొత్త డీపీఆర్ అసంపూర్తిగా ఉందని విమర్శించారు. నిర్మాణం, నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. ఆర్ఆర్ఆర్ , కాకతీయ టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ పార్క్ ప్రాజెక్టులను కేంద్రమే తీసుకొచ్చిందని, రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌‌‌‌‌‌‌‌కు ప్రధాని శంకుస్థాపన చేశారని, కానీ రేవంత్ రెడ్డి తానే తెచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు.  మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఎస్.కుమార్, ఎన్వీ సుభాష్, ప్రకాశ్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

దేనిలో బీజేపీ, బీఆర్​ఎస్​ కలిసిపోయినయో చెప్పాలి
బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ కలిసి పోయినట్లుగా సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రచారమే చేశారని కిషన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చీము, నెత్తురు, దమ్ము, ధైర్యం ఉంటే.. ఏ విషయంలో బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఒక్కటయ్యాయో చూపించాలి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ నన్ను వ్యక్తిగతంగా విమర్శించినా, తప్పుడు ఆరోపణలు చేసినా ప్రజలు దాన్ని విశ్వసించలేదు” అని అన్నారు. గత ఎన్నికల్లో మాదిరిగా జూబ్లీహిల్స్ బైపోల్​లో కూడా కాంగ్రెస్,  బీఆర్ఎస్ లు ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

‘‘రూ. లక్ష కోట్ల అవినీతి డబ్బులు కక్కిస్తానన్న రాహుల్ గాంధీ.. కనీసం రూ.లక్ష అయినా బయటకు తీసిండా? ఢిల్లీ స్థాయిలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇది వాస్తవం కాదా? రేవంత్ నుతప్పించాలని రాహుల్​గాంధీ అనుకున్నాడని కేటీఆర్ ప్రచారం చేసింది నిజం కదా?

ఫోన్ ట్యాపింగ్ కేసు, విద్యుత్ కొనుగోళ్ల కేసు, భూముల కొనుగోళ్ల కేసు ఏమయ్యాయో చెప్పాలి? రియల్ ఎస్టేట్ సంస్థలు, పరిశ్రమల వద్ద డబ్బులు వసూలు చేసి.. బిహార్ ఎన్నికలకు పంపారు” అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు సమయం ఉంటే.. తెలంగాణకు, హైదరాబాద్​కు కేంద్రం ఏం చేసిందో వివరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, వినే ధైర్యం వాళ్లకు ఉందా? అని ఆయన సవాల్​ చేశారు.