RTC కార్మికులను రోడ్డున పడేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు…

RTC కార్మికులను రోడ్డున పడేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు…

కార్మికులు సమ్మెచేయడం వాళ్ల హక్కు అని అన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. సోమవారం గాంధీ భవన లో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన… 35రోజుల ముందే సమ్మె చేస్తామని ఆర్టీసీ కార్మికులు చెప్పినా ఎందుకు సీఎం కేసీఆర్ పరిష్కరించలేదని అన్నారు. ఒక్క సంతకంతో 50వేల ఉద్యోగాలు తీసేస్తామంటే ఊరుకోమని అన్నారు. ఆరునెలలు కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగం లేకపోయేసరికి ఓర్చుకోలేక కేటీఆర్ కు, హరీష్ రావుకు మంత్రులుగా ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు సమ్మె చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులను జాబ్స్ నుంచి తీసేస్తున్నారని చెప్పారు.

సెక్రటేరియట్ కు రావడం లేని కేసీఆర్ పై పీడియాక్ట్ పెట్టాలని…అండమాన్ జైల్లో పెట్టాలని అన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక సంఘాలతో పెట్టుకున్న వారు బాగుపడ్డట్టు చరిత్రలో లేదని….తొందరలోనే కేసీఆర్ కొంప కూలుతుందని అన్నారు. కార్మికులను కేసీఆర్ కుక్కలతో పోల్చి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు. డీజిల్ కు 42 శాతం పన్ను ఆర్టీసీ కడుతోందని…డీజిల్ పన్నులే  ఏటా 700 కోట్లు ఆర్టీసీ చెల్లిస్తోందని చెప్పారు.

ప్రభుత్వం ప్రయాణికులకు ఇచ్చే రాయితీలు 700 కోట్లు చెల్లించకపోవడం కూడా ఆర్టీసీ నష్టాలకు కారణమని అన్నారు రేవంత్. స్పేర్ పార్ట్స్ కొనేందుకు వేసే అదనపు ట్యాక్స్ ల వల్ల 150 కోట్ల భారం ఆర్టీసీ పై పడుతోందని.. ఈ నష్టాలను పూడ్చే ప్రయత్నం చేయకుండా నష్టాల సాకుతో ప్రైవేట్ పరం చేసే కుట్ర కేసీఆర్ చేస్తున్నారని అన్నారు. 50వేల కోట్ల విలువైన ఆర్టీసీ భూములను కేసీఆర్ చుట్టాలు తీసుకున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. 50వేల మంది కార్మికులను, వాళ్ల కుటుంబాలను రోడ్డున వేస్తామంటే  తెలంగాణ సమాజం ఊరుకోదని ఆయన అన్నారు.