ఈడీ నోటీసులతో కేంద్రం కాంగ్రెస్ నేతలను వేధిస్తోంది

ఈడీ నోటీసులతో కేంద్రం కాంగ్రెస్ నేతలను వేధిస్తోంది

బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొనకుండా చేసేందుకు బీజేపీ ఈడీ నోటీసులు ఇప్పించిందని ఆరోపించారు. రాష్ట్రంలో నిజాయితీగా పని చేసే నేతలకు ఈడీ నోటీసులు వచ్చాయన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలైన షబ్బీర్ అలీ, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని చెప్పారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక నడిపించడానికి కాంగ్రెస్ నాయకులు చందాలు ఇవ్వడమే పాపమా..? అని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ పాదయాత్రకు రక్షణ కల్పించకుండా, అడ్డుకోవడానికి కేంద్రం కుట్రలు పన్నుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు ఈడీ నోటీసులు ఇప్పించి.. బీజేపీలో చేర్చుకునేలా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తమ అనుబంధ సంఘాలను పక్కనపెట్టి దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకుంటోందని చెప్పారు. ఈడీ కేసులతో సోనియా, రాహుల్ గాంధీని వేధించాలని చూశారని చెప్పారు. ఈడీ అంటే బీజేపీ ఎలక్షన్ డిపార్ట్ మెంట్ లా మారిందన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి రాబోతున్న సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు నోటీసులు ఇచ్చారంటూ మండిపడ్డారు. 

ప్రస్తుతం బీజేపీ పార్టీ ఖాతాలో రూ.5వేల కోట్ల వరకూ ఉన్నాయని, ఇంత డబ్బు ఎలా వచ్చిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీకి చందాలు ఇచ్చిన నాయకుల్లో ఒక్కరికైనా ఈడీ నోటీసులు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకి రానన్ని చందాలు ఒక బీజేపీకే ఎలా వచ్చాయన్నారు. అధికారిక లెక్కలే ఇలా ఉంటే.. అనధికార లెక్కల ప్రకారం ఎన్ని వేల కోట్లు వచ్చి ఉంటాయి..? అని అన్నారు. 

రాష్ట్రానికి వస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు గానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాను కాళేశ్వరం నిర్మాణంపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై చర్యలు తీసుకోవాలని మొరపెట్టుకున్నా ఇప్పటి వరకూ తీసుకోలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసే అవకాశం ఉన్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని చెప్పారు. టీఆర్ఎస్ ఖాతాలో రూ.865 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. పార్టీ ఆఫీస్ ల పేరుతో మరో వెయ్యి కోట్లు, హైదరాబాద్, ఢిల్లీలో పార్టీ కార్యాలయాలకు స్థలాలు ఎలా వచ్చాయన్నారు. కేసీఆర్, నరేంద్ర మోడీ మధ్య అవగాహన ఉండడం వల్లే ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు స్థలం కేటాయించారని చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న నాయకులను బీజేపీ భయపెడుతోందని రేవంత్ రెడ్డి చెప్పారు. తనను చూసి కాంగ్రెస్ లోకి రావాలని ఆసక్తి చూపిస్తున్న వారిని రానీయడం లేదన్నారు. ‘కల్వకుంట్ల కుటుంబం’పై బీజేపీకి ఎందుకంత ప్రేమ..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని టీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్లలో తనపై 120 కేసులు పెట్టించారని, జైలుకు కూడా పంపించారని తెలిపారు. న్యాయస్థానంలో అన్నీ ఎదుర్కొని ఇక్కడకు వచ్చామన్నారు. తనకు ఈడీ నోటీసులు కొత్తేమి కాదని, వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటానని అన్నారు. రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతున్న టీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ పై ఎందుకు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర కాంగ్రెస్ కు చెందిన ఐదుగురు నేతలు నేషనల్ హెరాల్డ్ పత్రికకు కోటి రూపాయల చందా ఇస్తే.. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ ను ఎందుకు వదిలేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ‘కాంగ్రెస్ లేకుండా చేస్తామని మా పార్టీలోని క్రియాశీలక నాయకుడికి బీజేపీ నేతలు చెప్పారు. దేశంలోని, రాష్ట్రంలోని సీనియర్ నేతలకు, పీసీసీ చీఫ్ రేవంత్ కు కూడా ఈడీ నోటీసులు తప్పవని చెప్పారు’ అని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కొంటామన్నారు. అందరికంటే ముందే అభ్యర్థిని పెట్టి, ప్రచారం చేస్తున్నామని చెప్పారు. ‘మునుగోడులో కొనుగోలు, అమ్మకాలే జరుగుతున్నాయి. మేము ఆడ బిడ్డకు సీటు ఇచ్చాం. తెలంగాణలో గుణాత్మక మార్పు తీసుకురావాలంటే మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించండి. మునుగోడు ఆడబిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి’ అని అన్నారు.

WWF గేమ్ లా కేసీఆర్, మోడీ డ్రామా ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రిని చేయడానికే  కేసీఆర్ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కలిసిన నేతలంతా యూపీఏ భాగస్వామ్యానికి చెందిన నాయకులని, తమతో కూడా వారు అన్ని విషయాలు మాట్లాడారని చెప్పారు. యూపీఏను చీల్చడానికే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. జాతీయ స్థాయిలో ఏపీ సీఎం వైఎస్ జగన్, MIM అధినేత అసదుద్దీన్ ను ఎందుకు కలుపుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రతీ చర్య.. బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడానికే అని చెప్పారు. మోడీని ఓడించాలనుకుంటే.. బీజేపీ భాగస్వామ్య పక్షాలను కేసీఆర్ బయటకు తీసుకురావాలన్నారు. మోడీ సూచనలతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, అందుకే ఆయనపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం లేదని చెప్పారు. ఈఎస్ఐ కుంభకోణంపై ఇప్పటి వరకు కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.