
సీఎం కేసీఆర్ తన ధన దాహంతో దశాబ్దాల చరిత్ర కల్గిన హైదరాబాద్ నగరంలో విధ్వంసం సృష్టిస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహీల్స్ లోని కేబీఆర్ పార్క్ దగ్గర నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలకు అనుమతులిస్తున్నారని విమర్శించారు. దయచేసి మంత్రి కేటీఆర్ చేస్తున్న ఈ ఆగడాలను కేసీఆర్ అడ్డుకోవాలని కోరారు. మంత్రి రాజయ్యను బర్తరఫ్ చేసినట్టు కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు అలా చేస్తే కేసీఆర్ కు పాప ప్రక్షాళన జరుగుతుందన్నారు. కేబీఆర్ పార్క్ చారిత్రాత్మక వారసత్వ సంపదని.. కేబీఆర్ పార్క్ లో జాతీయ పక్షి నెమలితో పాటు ఎన్నో విలువైన వన్యప్రాణులు ఉన్నాయని చెప్పారు. అందుకే కేంద్ర ప్రభుత్వం పార్క్ చుట్టూ నిర్మాణాలకు ఎన్నో నియమ నిబంధనలు పెట్టిందన్నారు.
జూబ్లీహీల్స్ చెక్ పోస్ట్ దగ్గర నిబంధనలకు విరుద్దంగా మంత్రి డెవ్ లపర్స్ కు 15 అంతస్తుల నిర్మాణాలకు అనుతిచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2006 లో కాంగ్రెస్ హయాంలో ఫైవ్ స్టార్ హోటల్ కోసం టెండర్లు పిలిచారని చెప్పారు. 2006లో మూడు అంతస్తులకు షరతులతో కూడిన అనుమతిచ్చారని.. అయితే కేసీఆర్ వచ్చాక 2016లో మంత్రి డెవ్ లపర్స్ అదనంగా ఫ్లోర్లకు అనుమతివ్వాలని అప్లికేషన్లు పెట్టుకుందని తెలిపారు. 2022 నుంచి మంత్రి డెవ్ లపర్స్ జుట్టు మంత్రి కేటీఆర్ చేతిలోకి వెళ్లిందన్నారు. అందుకే అందులో ఆర్ఎన్ ఆర్ డెవలపర్స్ కు వాటా ఇప్పించారని చెప్పారు. 2018లో మంత్రి డెవ్ లపర్స్ కు 7 అంతస్తులకు అనుమతిచ్చారని..ఆ తర్వాత ధన దాహం తీరని ఆ సంస్థ 12 అంతస్తులకు దరఖాస్తు చేసుకుంటే అనుమతిచ్చారని చెప్పారు. ఈ బిల్డింగ్ లో ఒక్కో అంతస్తులో 200ల ఫ్లాట్లు నిర్మించారని.. ఒక్కో ఫ్లాట్ రూ. 21కోట్లుగా ఉందన్నారు. భూమి లోపల ఐదంతస్తులకు అనుమతిచ్చారని..ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.
కేటీఆర్ తన మిత్రుల కోసం, సత్యం రాజుల కోసం నిబంధనలు తుంగలో తొక్కారని రేవంత్ ఆరోపించారు. కేటీఆర్ నగరాన్ని విధ్వంసం చేసి హైదరాబాద్ నగర చరిత్రను కనుమరుగు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో మీరు తవ్విన గోతుల్లోనే మిమ్మల్ని పాతిపెడతామంటూ రేవంత్ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్సోళ్లకు ఆంధ్రానే దిక్కని.. ఆపై బంగాళాఖాతమేనని రేవంత్ అన్నారు.
కేబీఆర్ పార్క్ నుంచి 120 గజాల వరకు ఎలాంటి నిర్మాలు చేయకూడదనే నిబంధన ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పార్కును ఆనుకుని 15 అంతస్తుల బిల్డింగ్ నిర్మిస్తున్నారని తెలిపారు. కేబీఆర్ పార్క్ దగ్గరకు వచ్చే వాకర్స్ అసోసియేషన్ ప్రజాప్రయోజన వాజ్యం వేయాలని కోరారు. అనుకోని ప్రమాదాలు జరిగితే భూమి లోపల ఉండే ఐదంతస్తుల నుంచి ఎవరైనా బయటకు వస్తారా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎపిసోడ్ ఒకటి అయ్యిందని.. రెండు మూడు రోజులు గ్యాపిచ్చి మరిన్ని వివరాలతో మీడియా ముందుకు వస్తానని చెప్పారు.