గంజాయికి అడ్డాగా హైదరాబాద్: రేవంత్

గంజాయికి అడ్డాగా హైదరాబాద్: రేవంత్
  • ఇలాంటి పాలనపై తిరగబడదాం, తరిమికొడదాం
  • మీర్​పేట బాలిక అత్యాచార ఘటనపై విచారం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ సిటీ గంజాయి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారిందని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. మీర్​పేట్​ బాలిక అత్యాచార ఘటనపై ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ‘హైదరాబాద్​ను విశ్వనగరంగా మార్చామని సీఎం కేసీఆర్​ గప్పాలు కొడుతున్నారు. కానీ, బీఆర్ఎస్ పాలనలో సిటీ గంజాయి, మత్తు  పదార్థాలకు అడ్డాగా మారింది. నిన్న సింగరేణి కాలనీలో, నేడు మీర్​పేట్​లో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు కలచివేస్తున్నాయి. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని ప్రజల మానప్రాణాలను గాలికొదిలేశారు. ఇలాంటి పాలనపై తిరగబడదాం.. తరిమికొడదాం’ అని రేవంత్​ ట్వీట్​లో పేర్కొన్నారు.  

బీఆర్ఎస్​ పాలనలో 88 వేల మంది రైతులు మృతి

పావలా వడ్డీ,  బంగారు తల్లి లాంటి పథకాలను కేసీఆర్​ అటకెక్కించారని రేవంత్​ అన్నారు. తెలంగాణ వస్తే పేదల బతుకులు బాగుపడతాయన్న కేసీఆర్.. వారి సంక్షేమాన్నే మరిచారని ఫైర్​ అయ్యారు. వరి వేస్తే ఉరి అని చెప్పిన రైతు వ్యతిరేకి కేసీఆర్​ అని విమర్శించారు. కేసీఆర్​ సీఎం అయ్యాక 88 వేల మంది రైతులు చనిపోయారని ఆరోపించారు. మంగళవారం చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు జూబ్లీహిల్స్​లోని రేవంత్​ ఇంట్లో ఆయన సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.  

దళితులకు మూడెకరాలు, డబుల్​ బెడ్రూం ఇండ్లు సహా ఇచ్చిన హామీలను కేసీఆర్​ నెరవేర్చలేదని రేవంత్​ అన్నారు. దళితులకు భూములిచ్చింది, పేదలకు ఇండ్లు పంచింది కాంగ్రెస్​ పార్టీనేనని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుస్తుందని, ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కచ్చితంగా రూ.4 వేల పెన్షన్​ను అమలు చేస్తామన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు తదితరులకు పింఛన్​ అందజేస్తామన్నారు.