శ్రీకాంతాచారి అమరుడైన రోజున ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చిన్రు: రేవంత్

శ్రీకాంతాచారి అమరుడైన రోజున ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చిన్రు: రేవంత్
  • ప్రగతిభవన్​ను అంబేద్కర్ ప్రజా భవన్​గా మారుస్తం  
  • ఆ ప్రజా భవన్, సెక్రటేరియెట్​లోకి ప్రజలందరికీ ఎంట్రీ
  • ఆరు గ్యారంటీలను అమలు చేస్తం
  • ప్రతిపక్షాలు ప్రజాతీర్పునకు తలవంచి.. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని, ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘డిసెంబర్​3న శ్రీకాంతాచారి అమరుడయ్యారు. ఇవాల్టి ప్రజా తీర్పును ఆయనకు అంకితమిస్తున్నాం. కాంగ్రెస్​ గెలుపులో 30 లక్షల మంది నిరు ద్యోగుల పట్టుదల ఉంది. ప్రజస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రజలు పూర్తిగా సహకరించారు. ప్రతిపక్షంలో ఎవరుండాలనేది వారే నిర్ణయించారు” అని పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు దేశంలో ఎట్లయితే ప్రజాస్వామిక పాలనను కాంగ్రెస్​ అందించిందో, ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి ప్రజాస్వామిక పాలనను కొనసాగిస్తామని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞతగా కాంగ్రెస్​ను గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం గాంధీభవన్​లోని ఇందిరాభవన్​లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ప్రగతిభవన్​ను అంబేద్కర్ ​ప్రజాభవన్​గా మారుస్తామని ఆయన తెలిపారు. ఆ ప్రజాభవన్​లోకి ప్రజలందరికీ ప్రవేశం ఉంటుందని, అక్కడ చుట్టూ పెట్టిన గేట్లను తొలగిస్తామని చెప్పారు. ప్రగతి భవన్​ ప్రజల ఆస్తి అని, దాన్ని ప్రజల బాగు కోసమే వినియోగిస్తామని పేర్కొన్నారు. ఇకపై సెక్రటేరియెట్ వద్ద ఎలాంటి నిర్బంధాలు ఉండవని.. ప్రజలు, జర్నలిస్టులు ఎవరైనా సెక్రటేరియెట్​లోకి రావొచ్చని తెలిపారు.

ఆరు గ్యారంటీలు అమలు చేస్తం..

రాహుల్​గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టేలా పాలన కొనసాగిస్తామని రేవంత్​ చెప్పారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన మిగతా అంశాలపైనా మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. ‘‘ఏ సమస్య వచ్చినా నైతికంగా రాహుల్​ అండగా ఉన్నారు. రాహుల్ మద్దతుతో నేను, భట్టి విక్రమార్క, సీనియర్​ నేతలు వి.హనుమంతరావు, జానారెడ్డి, ఉత్తమ్​కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్​బాబు, మధుయాష్కీ వంటి నేతలందరం కలిసి ఐక్యంగా ఈ విజయానికి కృషి చేశాం. భారత్​ జోడో యాత్ర ద్వారా రాహుల్​ రాష్ట్ర ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. తెలంగాణతో తమది కుటుంబ అనుబంధమని చెప్పి ప్రజల్లో ఆయన విశ్వాసం నింపారు. ఈ విజయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. పేదలను ఆదుకుంటాం” అని తెలిపారు. కాగా, కాంగ్రెస్​విజయాన్ని అభినందించిన కేటీఆర్​కు రేవంత్​కృతజ్ఞతలు చెప్పారు. ప్రజాతీర్పుకు తలవంచి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపక్షం సంపూర్ణంగా సహకరించాలని, ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో ప్రతిపక్షాలన్నింటినీ ఆహ్వానిస్తామని తెలిపారు.

మిత్రపక్షాలను కలుపుకుని పోతం..

కాంగ్రెస్​ విజయంలో కీలక పాత్ర పోషించిన మిత్రపక్షాలను కలుపుకుని ముందుకుసాగుతామని రేవంత్​చెప్పారు.‘‘కాంగ్రెస్ ​గెలుపులో సీపీఐ, టీజేఎస్ తమవంతు పాత్ర పోషించాయి. కోదండరాం, చాడ వెంకట్ రెడ్డి, అజీజ్ పాషా వంటి నేతలు సహకారం అందించారు. ప్రభుత్వంలో వాళ్ల ఆలోచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటాం” అని చెప్పారు. “ఏదేమైనా బీఆర్ఎస్ ​పార్టీకి నాది ఒక సూచన. ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. పాలక పక్షం ఎవరు? ప్రతిపక్షం ఎవరన్నది స్పష్టంగా తీర్పునిచ్చారు. ప్రతిపక్షంలో కూడా మిగతా పార్టీల పాత్రను ప్రజలు నిర్ణయించారు. ప్రజల ఆదేశాన్ని ఒక సందేశంగా తీసుకుని మేం ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం. రాష్ట్రంలో నూతన సంప్రదాయానికి, ప్రజాస్వామ్య విలువలు పునరుద్ధరించ డానికి బీఆర్ఎస్​ పార్టీ కలిసి వస్తుందని కోరుకుంటున్నాం. గతంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి జరిగిన ప్రయత్నాలు మళ్లీ జరగబోవని భావిస్తున్నాం” అని రేవంత్ వ్యాఖ్యానించారు.