టీఆర్ఎస్, ఎంఐఎం అఘాయిత్యాల్లోనూ పార్ట్​నర్లే

టీఆర్ఎస్, ఎంఐఎం అఘాయిత్యాల్లోనూ పార్ట్​నర్లే
  • ఆడబిడ్డ బయటికెళ్తే, భద్రంగా ఇల్లు చేరే పరిస్థితి లేదు: రేవంత్​
  • పబ్​ల వెనక ఉన్న రాజులు, యువరాజులెవరో సాక్ష్యాలతో బయటపెడతా
  • జూబ్లీహిల్స్ బాలిక కేసులో ఎవిడెన్స్​ను సీపీ దాస్తున్నరు

న్యూఢిల్లీ, వెలుగు:టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఎన్నికలు, అధికారంలోనే కాకుండా అఘాయిత్యాల్లు,మర్డర్స్​లోనూ పార్ట్​నర్లుగా ఉన్నాయని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ఈ రెండు పార్టీల లీడర్ల పిల్లలే  జూబ్లీహిల్స్ లో బాలికపై దారుణానికి తెగబడ్డారని ఆయన అన్నారు. ‘‘ఆడపిల్ల బయటకు వెళ్తే, భద్రంగా ఇంటికి వస్తుందో ? లేదో అనే పరిస్థితులు హైదరాబాద్ లో దాపురించాయి. కేసీఆర్ కు ఆదాయం వస్తే చాలు, రాష్ట్రం ఏమైనా పర్వాలేదు అనే స్థితి వచ్చింది.  ప్రభుత్వ తీరును, కేసీఆర్ ను ప్రజలు నిలదీయాలి” అని అన్నారు. అమెరికా పర్యటన ముగించుకొని బుధవారం ఢిల్లీ చేరుకున్న రేవంత్​రెడ్డి.. అక్కడ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. మైనర్ అఘాయిత్య ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పిన విధానం చూస్తుంటే, కొందరిని తప్పించే ప్రయత్నం చేసినట్టుగా ఉందన్నారు. 

ఈ సంఘటనలో నిందితులు, బాధితురాలు ప్రయాణించిన బెంజ్ కారు,ఇన్నోవా కారు కీలకమైన ఆధారాలని, వాటి యజమానుల వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదని రేవంత్​ ప్రశ్నించారు.మే 28కి ముందు జరిగిన స్టోరీ సీపీ చెప్తున్నారని, అసలు కథ 28 సాయంత్రం మొదలైందన్నారు. ఈ నేరం వెనుక ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్న వక్ఫ్ బోర్డ్ చైర్మన్​, ఎంఐఎం నేతల పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. ‘‘ఇన్నోవాను డ్రైవర్ నడపలేదని కమిషనర్ చెప్పారు. అలాంటప్పుడు మైనర్ నడిపితే ఎమ్వీ యాక్ట్ ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోలేదు? ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఉపయోగించాల్సిన కారును అసాంఘిక కార్యక్రమాల కోసం వాడారు. అఘాయిత్యానికి వినియోగించిన కారును ఎక్కడ స్వాధీనం చేసుకున్నారో చెప్పలేదు? కారులో దొరకాల్సిన కీలకమైన ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తుడిచిపెట్టే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తున్నది. దీని ద్వారా నిందితులపై కేసును బలహీనపరిచి, శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నరు. ఇదే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సీపీ సీవీ ఆనంద్ దాటవేత సమాధానాలిచ్చారు” అని రేవంత్​ తెలిపారు. అఘాయిత్యా ఘటనలో వాడిన బెంజ్, ఇన్నోవా కార్ల యజమానులకు నోటీసులు ఇచ్చి, వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ‘‘ఎవర్ని కాపాడాలనుకుంటున్నారు. ఎవరి ఒత్తిడికి లోనై కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఎంకు నివేదిక ఇచ్చారా? ఇచ్చిన కేసీఆర్ పట్టించుకోవడం లేదా?” అని సీపీ సీవీ ఆనంద్ ను ఆయన ప్రశ్నించారు. 

విశ్వనగరాన్ని... విష నగరంగా మార్చారు...
విశ్వనగరమైన హైదరాబాద్​ను క్లబ్స్ అండ్ పబ్స్ సంస్కృతితో ప్రభుత్వం విష నగరంగా మార్చుతున్నదని రేవంత్​ మండిపడ్డారు. ‘‘హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌‌ను దెబ్బతీసేలా పబ్‌‌లు, డ్రగ్స్ కల్చర్‌‌ను ప్రోత్సహిస్తున్నదన్నారు. వారం, పది రోజుల్లో హైదరాబాద్ పరిధిలోనే వరుస అఘాయిత్యాలు జరిగాయని, దీంతో హైదరాబాద్ కు రావాలంటే విదేశీయులు భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.  లిక్కర్ అమ్మకం ద్వారా ఆదాయం సంపాదించుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, అమ్మకాలకు సహకరించేలా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నదన్నారు.  ‘‘బాలికలపై అఘాయిత్యాలు జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు సమీక్ష నిర్వహించడం లేదు? జాతీయ, అంతర్జాతీయ అంశాలపై స్పందించే ఒవైసీ..  బాలిక ఘటన విషయంలో ఎందుకు స్పందించరు?’’ అని రేవంత్​ నిలదీశారు.  హైదరాబాద్‌‌ను రక్షించుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని,  హైదరాబాద్  బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అవసరమైతే న్యాయస్థానాల్లో కొట్లాడుతామని, అది కాకుంటే యూత్ కాంగ్రెస్, ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిన క్లబ్స్, పబ్స్ పై దాడులు  చేస్తారని చెప్పారు. ‘‘రాత్రి పదకొండున్నర తర్వాత ఎక్కడ క్లబ్స్, పబ్స్ ఓపెన్ గా ఉన్నా  వాటిపై భౌతిక దాడులకు దిగాలి. ప్రభుత్వమే సరైన సందర్భంలో, సరైన విధంగా స్పందిస్తే... కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ కు అలా చేయాల్సిన పని ఉండదు” అని అన్నారు.

అమ్మాయిల పికప్ సెంటర్లుగా మార్చింది...
ఇంటర్నేషనల్  ఎయిర్ పోర్ట్ ను అడ్డంపెట్టుకొని, హైదరాబాద్ లో విచ్చలవిడిగా పబ్ ల మాఫియాను రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నదని  రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ‘‘ఎయిర్ పోర్ట్ లోని ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వమే ఈ పబ్ లను నిర్వహిస్తున్నది. ఇవి బ్రోతల్ హౌస్​లకు తక్కువ కాదు. ఈ పబ్​లు బ్రోతల్​ హౌస్​లుగా మారాయి. దీనికి సీఈవోగా రాష్ట్ర ఇండస్ట్రీ, కామర్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్​ రంజన్​ను కేటీఆర్​ నియమించారు’’ అని ఆయన ఆరోపించారు. ‘‘ఈ పబ్ లు ఎవరివి, పబ్ ల వెనక ఉన్న రాజులు, వాటి వెనక ఉన్న యువ రాజులు ఎవరన్నది ఆధారాలతో త్వరలో బయటపెడతా’’ అని స్పష్టం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను జయేశ్ రంజన్ దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ స్థలంలో పబ్ ల కోసం ఇచ్చిన అనుమతులను తక్షణమే ఉపసంహరించుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో జరుగుతున్న అఘాయిత్యాలు, డ్రగ్ కేసులు, పబ్ ల అక్రమ నిర్వహణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు. ఫుడ్డింగ్ మిక్సింగ్ పబ్ కేసులోనూ అసలైన యజమానిని తప్పించారని, ఆ యాజమాని పేరును సాక్ష్యాధారాలతో మీడియా ముందుంచుతానని చెప్పారు.