
కాళేశ్వరం ప్రాజెక్టు మానవ నిర్మిత అద్భుతమంటూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసించడాన్ని కాంగ్రెస్ నాయకుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. బాధ్యతలు తీసుకుని 24 గంటలకు గడవకముందే గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అవగాహనకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో పోరాడుతున్నట్టుగా… కేంద్రంలో కలిసే ఉంటున్నట్టుగా.. టీఆర్ఎస్ – బీజేపీ డబుల్ గేమ్, డమ్మీ గేమ్ ఆడుతున్నాయని విమర్శించారు రేవంత్ రెడ్డి. ఆ రెండు పార్టీలు దోస్తులే అన్నారు.
విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి అంశాన్ని రెండేళ్ల కిందటే తాను లేవనెత్తాననీ.. ఇపుడు బీజేపీ హడావుడి చేస్తోందన్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ చేసే స్థితిలో ఉండి కూడా.. బీజేపీ రాజకీయ ఆరోపణలతో సరిపెడుతోందన్నారు. కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు అని రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే.. గవర్నర్ తమిళిసై ఆ ప్రాజెక్టు అద్భుతం అని చెప్పిన మాటలు.. అవినీతికి వత్తాసు పలికినట్టుగా… ప్రజల సెంటిమెంట్ ను కరెన్సీ కట్టలుగా కేసీఆర్ మార్చుకున్న తీరుకు మద్దతిస్తున్నట్టుగా ఉందని అన్నారు. టీఆర్ఎస్ తో బీజేపీది ఉత్తుత్తి ఫైటేనని అన్నారు.
బీజేపీ పోరాటం నిజమైతే… గవర్నర్ కామెంట్స్ పై నాయకులు అభ్యంతరం చెప్పి ఉండాల్సిందన్నారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ తో బీజేపీ చీకట్లో దోస్తీ… వెలుగులో కుస్తీ చేస్తోందనడానికి పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ మౌనమే ఓ కారణం అన్నారు. కమలం పువ్వు, గులాబీ పువ్వు రెండూ కలిసి రాష్ట్ర ప్రజల చెవిలో పువ్వులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయనీ.. జనం ఆ ప్రయత్నాలను తిప్పికొట్టాలని అన్నారు రేవంత్ రెడ్డి.