
హైదరాబాద్, వెలుగు: ఎకరానికి వంద కోట్లు పెట్టగలిగేలా బీఆర్ఎస్ నేతలు ఎదిగారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేదలు మాత్రం పేదలుగానే ఉంటున్నారని అన్నారు. కోకాపేట, బుద్వేల్‌లో భూములు కొన్న కంపెనీల పేర్లను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అక్కడ భూములు కొన్నది బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ బినామీలేనని ఆరోపించారు. ఆర్టిఫిషియల్ బూమ్‌ను క్రియేట్ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్రలు పన్ని, డ్రామా ఆడారాని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునే వారి కోసం అప్లికేషన్ ఫామ్ ను శుక్రవారం గాంధీ భవన్లో విడుదల చేశాక మీడియాతో చిట్‌చాట్ చేశారు.
పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు అన్ని శాఖల్లో ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసేవాళ్లున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ లీడర్లపై తప్పుడు కేసులు పెట్టేటోళ్లను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తాను చెప్పేది ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, భుజంగ రావు, నర్సింగ్ రావు లాంటి అధికారుల గురించే అన్నారు.
మెజారిటీ, మైనారిటీ తేడా లేదు
హైకోర్టు చెప్పినా ప్రభుత్వం తన భద్రత పెంచడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు కావాల్సినంత భద్రతనిచ్చామన్నారు. తాను ప్రజల మనిషి అని, సెక్యురిటీ అవసరం లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ, మైనారిటీలన్న తేడా లేదని రేవంత్ అన్నారు. తొమ్మిదేండ్లలో మైనారిటీల కోసం బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో ఒక్క శాతం కూడా మైనారిటీలకు దక్కలేదని పేర్కొన్నారు. బీజేపీ తెచ్చిన అన్ని ప్రజా వ్యతిరేక బిల్లులకు కేసీఆర్ మద్దతిచ్చారన్నారు. ఎమ్మెల్యే టికెట్ల ఆశావహులు పెట్టుకున్న దరఖాస్తులను పార్టీ సెంట్రల్ ఎలక్షన్, స్క్రీనింగ్ కమిటీ పరిశీలించాకే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చెప్పారు. పార్టీకి చేసిన సేవలు, సర్వే, గెలుపు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే లిస్ట్ తయారు చేస్తాన్నారు.
చేవెళ్ల సభ 24 నుంచి 26కి వాయిదా
కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన చేవెళ్ల సభ వాయిదా పడింది. ఈనెల 24న జరగాల్సిన సభను.. 26వ తేదీకి పోస్ట్‌పోన్ చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 24న రాజస్థాన్‌లో పలు కార్యక్రమాలకు హాజరవుతుండడంతో సభను వాయిదా వేయాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి.