- తప్పు చేసిన వారిని శిక్షించాల్సిందే
- మోదీ ఆదేశాల మేరకే సర్ ప్రక్రియ
- రాహుల్, ఖర్గే, ప్రియాంక అరెస్టు అక్రమం
- జ్ఞానేశ్ రిజైన్ చేసే వరకు ఉద్యమిస్తం
న్యూఢిల్లీ: దేశ ప్రజల ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఓటు హక్కు ఉన్నవారు, లేనివారు అంటూ రెండు వర్గాలను సృష్టించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ద్వారా సర్ ప్రక్రియ కొనసాగుతోందని విమర్శించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తే.. ఆయనను అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలను అరెస్టు చేసిందని.. ఇది ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనన్నారు. బుధవారం ఢిల్లీలో రాహుల్, ప్రియాంకలను పోలీసులు అరెస్ట్ చేసి బారాఖంబా పోలీస్ స్టేషన్‌కు తరలించగా.. వారిని కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు.
నేతలను కలవనీయకుండా రేవంత్‌ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో సైమన్ గో బ్యాక్ ఉద్యమం దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిందని సీఎం గుర్తుచేశారు. ఇప్పుడు దేశంలో ‘సర్ గో బ్యాక్’, ‘జీకే గో బ్యాక్’ ఉద్యమం కొనసాగుతోందని అన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. గతంలో రైతుల ఉద్యమం సందర్భంగా మోదీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించినా.. చివరకు ప్రజల ఒత్తిడికి తలొగ్గి చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా దిగిరాక తప్పదన్నారు. వ్యవహారం మరింత ముదిరితే ప్రధాని కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
ప్రజల ఓటు హక్కును ఎవరూ లాక్కోలేరు
సర్ పేరుతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓట్లను డిలీట్ చేశారని రేవంత్ ఆరోపించారు. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఓటు హక్కును ఎవరూ లాక్కోలేరని స్పష్టం చేశారు. గతంలో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలను ఉపయోగించుకున్నారని, ఇప్పుడు నేరుగా ఎన్నికల సంఘాన్నే రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల ఓట్లను తొలగించి తమకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలను మార్చే ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకుంటుందని చెప్పారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసులు వ్యవహరించిన తీరును చూస్తే మోదీ, అమిత్‌షాల అసహనం స్పష్టంగా కనిపిస్తోందని సీఎం అన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, పదవులను కాపాడుకునేందుకు ప్రతిపక్ష నేతలపై పోలీసులను ప్రయోగిస్తున్నారని విమర్శించారు.
ఇది ప్రజల ఉద్యమం
దేశంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితమైన ఉద్యమం కాదని.. ప్రజల ఉద్యమమని అన్నారు. దేశ ప్రజలు ఒక్కటై గొంతెత్తితే ప్రభుత్వం తప్పనిసరిగా వినాల్సిందేనని, లేకపోతే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.
ప్రజల హక్కులను కాలరాసిన వారు ఎవరూ చరిత్రలో తప్పించుకోలేదని, చివరకు ప్రజా కోర్టులోనే తీర్పు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాల డిమాండ్‌ను అంగీకరించి జ్ఞానేశ్ కుమార్‌తో రాజీనామా చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు వీధుల నుంచి పార్లమెంట్ వరకు పోరాటం కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కార్యకర్తలంతా ఐక్యంగా ముందుకు సాగుతారని, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
