
- పనుల ఇప్పుడు అంచనా వ్యయం పెరిగే చాన్స్ ఉంది..
- తక్షణమే శ్రీపాద 9వ ప్యాకేజీ పనులను కంప్లీట్ చేయాలి
రాజన్న సిరిసిల్ల: మంత్రి కేటీఆర్ కాంట్రాక్టర్లకు లొంగిపోయినందు వల్లే శ్రీ పాద 9వ ప్యాకేజీ కాలువ పనులు ఆలస్యమయ్యాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. జిల్లాలోని గంభీరావుపేట మండలంలో ఉన్న సముద్ర లింగాపూర్ గ్రామంలో కాలేశ్వరం 9వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. కాలువ పనులు పూర్తి చేయకపోవడానికి గల కారణాలపై ఫోన్ ద్వారా అధికారులను ప్రశ్నించారు. పనులు ఆలస్యం చేయడం ద్వారా అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉందని... పనుల్లో జాప్యం తగదన్నారు. పనులు సరిగా చేయడం లేదన్న నెపంతో కేటీఆర్ తన అనుయాయులైన కడప జిల్లా వారికి కాంట్రాక్టు అప్పగించారని విమర్శించారు.
లాభాలు దండుకుని, మిగిలిన పనులను గాలికొదిలేశారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఆలస్యం కావడానికి , అంచనా వ్యయం పెరగటానికి కారణమైన సంస్థ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రాంత రైతులపై ఆ కాంట్రాక్టర్లకు ప్రేమలేదని అన్నారు. కమీషన్ల కక్కుర్తితో కేటీఆర్ రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. తక్షణమే 9వ ప్యాకేజీ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే దీనిపై స్థానిక నాయకత్వం పోరాడుతామన్నారు.