రైతుల రక్తం తాగుతూ కోట్లు దోచేస్తున్నరు

రైతుల రక్తం తాగుతూ కోట్లు దోచేస్తున్నరు

హైదరాబాద్‌/ఆమనగల్లు, వెలుగు: ఫార్మాసిటీ పేరుతో పేద రైతుల వేలాది ఎకరాల భూములను తక్కువ ధరకు కొని ఎక్కువ రేటుకు కంపెనీలకు అమ్ముకున్నారని కేసీఆర్‌పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రైతుల రక్తం తాగుతూ రూ. కోట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. కొత్త అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రాజీవ్‌ రైతు భరోసా యాత్ర పేరుతో రేవంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర 8వ రోజుకు చేరుకుంది. పాదయాత్రలో భాగంగా ఆదివారం మార్గమధ్యలోని మైసిగండి మైసమ్మ ఆలయంలో రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. కడ్తాల్‌ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..  కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకే రైతు బిడ్డగా వచ్చానని చెప్పారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్‌ను ఢిల్లీకి పిలిపిస్తే చలి జ్వరం వచ్చి ఫాంహౌస్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్‌ ఇండ్లు ఇస్తామని చెప్పి శిలాఫలకాలు వేసి ఇండ్లు నిర్మించట్లేదని విమర్శించారు.

పాదయాత్రను అడ్డుకున్న మాజీ సర్పంచ్ అరెస్ట్​

కడ్తాల్ మండలం మైసిగండి వద్ద రేవంత్‌ పాదయాత్రను అడ్డుకున్నారని మైసిగండి మాజీ సర్పంచ్ శేఖర్‌గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పాదయాత్రకు ఎదురుగా బైక్‌పై వస్తున్న శేఖర్‌గౌడ్‌ను పక్కకు తప్పుకోవాలని పోలీసులు కోరగా ఆయన వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

ఆసరా పెన్షన్‌ను 57 ఏండ్లకు తగ్గించండి

ఆసరా పెన్షన్ వయసును 57 ఏండ్లకు తగ్గించాలంటూ సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ ఆదివారం లెటర్ రాశారు. పెన్షన్ వయసును 60 నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారని.. అది ఇంకా అమలవట్లేదని అన్నారు. తాను చేస్తున్న పాదయాత్రలో వేలాది మంది పెన్షన్ అంశాన్నే ఎక్కువగా తన దృష్టికి తెస్తున్నారన్నారు. కుటుంబంలో ఇద్దరు అర్హులు ఉంటే ఇద్దరికీ పెన్షన్ ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 57 ఏండ్లకు పైనున్న వారి లెక్కలు తీయాలని కోరారు.