తెలంగాణ ఇచ్చింది ఓఆర్ఆర్​ను అమ్ముకోడానికి కాదు: రేవంత్ రెడ్డి

తెలంగాణ ఇచ్చింది ఓఆర్ఆర్​ను అమ్ముకోడానికి కాదు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందే తప్ప.. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)​ను అమ్ముకోవడానికి, దళితుల భూములను గుంజుకోవడానికి కాదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ లక్షల కోట్ల రూపాలయ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ 10 వేల ఎకరాల భూములను కేసీఆర్ కుటుంబం ఆక్రమించిందని మండిపడ్డారు. 

సోమవారం అలంపూర్, దేవరకద్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు గాంధీభవన్​లో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలకు కాంగ్రెస్ భూములను ఇస్తే.. అభివృద్ధి ముసుగులో కేసీఆర్ వాటిని గుంజుకున్నారని విమర్శించారు. ఎకరం రూ.100 కోట్లు పలికే భూములకు.. రైతుల వద్ద నుంచి తీసుకున్నప్పుడు కనీసం రూ.కోటి అయినా పరిహారం ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. 

సొంతోళ్లకు ఇచ్చేందుకే వైన్స్ టెండర్స్

అన్ని సర్వేలు బీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్తున్నాయని రేవంత్ అన్నారు. అందుకే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి విదేశాలకు పారిపోయేందుకు కేసీఆర్ స్కెచ్ వేశారని ఆరోపించారు. సొంత మనుషులకు ఇచ్చుకునేందుకే ఇప్పుడున్న వైన్ షాపుల గడువు ముగియకముందే కొత్త టెండర్లను పిలిచారని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చాక మళ్లీ టెండర్లు పిలుస్తామన్నారు. డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టడానికి జాగా లేదన్న కేసీఆర్.. వందల ఎకరాలు ఎలా అమ్మేస్తున్నారని ప్రశ్నించారు. భూములు కొన్నోళ్లు, కొనేటోళ్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. రెడ్ డైరీలో పోలీసు అధికారుల పేర్లు రాసి పెడుతున్నామని, అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.