తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం

 తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం

కొడంగల్ ఎమ్మెల్యే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిసెంబర్ 7వ తేదీ గురువారం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తూ రేవంత్ రెడ్డి..  తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.  

"తెలంగాణ ప్రజలకు అభినందనలు. విద్యార్ధుల పోరాటం, అమరవీరుల త్యాగాలు, శ్రీమతి సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది.  రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు... బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. మీ అందరి ఆశీస్సులతో 2023, డిసెంబర్ 7న మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికి ఇదే ఆహ్వానం" అని సోషల్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను కోరారు.

ఈ ప్రమాణస్వీకారాని సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతోపాటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎం, తమిళనాడు సీఎం ఎంకెస్టాలిన్, ఎపి సీఎం జగన్, ఎపీ, తెలంగాణ మాజీ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్, తెలంగాణలో అన్ని పార్టీల అధ్యక్షులు, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.