
హైకోర్టులో ఎంపీ రేవంత్ పిటిషన్…
నేడు విచారణ
హైదరాబాద్: సచివాలయం కూల్చకుండా ఉత్తర్వులివ్వాలని కాంగ్రెస్ ఎంపీ ఎ. రేవంత్‌రెడ్డి గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కనీసం వందేళ్లు ఉండే బిల్డింగులను కూల్చి కొత్త వాటిని నిర్మించడం ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘2015లోనే సచివాలయ భవనాలకు మరమ్మతులు చేశారు. ప్రజల ఆస్తులు, ప్రభుత్వ సంపదకు ప్రభుత్వం ట్రస్టీగా ఉండాలి. ఇలాంటి దుర్వినియోగ నిర్ణయాలు తీసుకోవద్దు. ఇష్టానుసారంగా పని చేయొద్దు. కూల్చివేతలను నిలిపేలా వెంటనే స్టే ఇవ్వాలి. ప్రభుత్వ నిర్ణయం ప్రజా వ్యతిరేకమని తీర్పివ్వాలి’ అని పిల్‌లో పేర్కొన్నారు. జీఏడీ ముఖ్య కార్యదర్శి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి/చీఫ్ ఇంజనీర్‌లను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు. రేవంత్ పిటిషన్‌తో పాటు కాంగ్రెస్ నేత టి. జీవన్‌రెడ్డి, ఇతరులు దాఖలు చేసిన ఈ తరహా వ్యాజ్యాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించనుంది.