
మల్కాజిగిరి, వెలుగు:ప్రశ్నించే గొంతుకే ఓటెయ్యాలని మల్కాజిగిరి లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరిలోని టీజేఎస్ కార్యాలయంలో రేవంత్ తో కలిసి తెలంగాణ జనసమితి నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డికి తమ మద్దతు ఉంటుందని కపిలవాయి ప్రకటించారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లా డుతూ ఎమ్మెల్సీలుగా గెలిచిన అభ్యర్థులకు అభినందనలు, రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకు మంచి రోజులు మొదలయ్యాయని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే పార్లమెం ట్ ఎన్నికల్లోనూ ఉంటాయని చెప్పారు. కేసీఆర్ కుటుంబాన్ని భరించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని టీజేఎస్ నాయకులు మద్దతు పలకడం సంతోషంగా ఉందన్నారు. మల్కాజిగిరి ఎంపీగా మల్లారెడ్డి ఏమీ చేయలేదని, నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. ప్రతిపక్షం బలంగా ఉండాలంటే ప్రశ్నించే గొంతు ఉండాలన్నారు. ఎలాంటి రాజకీయ అనుభవంలేని రాజశేఖర్ రెడ్డికి టీఆర్‍ఎస్ పార్టీ పార్లమెం ట్ సీటు కేటాయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు కపిలవాయి దిలీప్ కుమార్. మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జ్ నందికంటి శ్రీధర్, ప్రవీణ్, కార్యకర్తలు,టీజేఎస్ నాయకులు పాల్గొన్నారు.