- ప్రాజెక్టును ముంచిన దొంగల చేతికి
- మళ్లీ తాళాలు ఇచ్చే ప్రసక్తే లేదు
- బినామీల వెనుక దాక్కోకుండా ఎల్ అండ్ టీ సబ్ -కాంట్రాక్ట్ తీసుకోవాలని హరీశ్‌కు సవాల్
- నీటిని నిల్వ చేసి ఎత్తిపోసేందుకు ఎన్‌డీఎస్‌ఏ అనుమతులు తేవాలని ఈటలకు సీఎం సవాల్
- జైలు భయంతోనే ‘కిలాడీ కమిటీ’ డ్రామాలు..
- తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ బోనులో నిలబెడతాం
- ఆంధ్రా కాలేజీల యాజమాన్యాలపై
- హరీశ్ బ్లాక్ మెయిల్ రాజకీయం
- చేసిన పాపాలు బయటపడేసరికి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో దాక్కుండని విమర్శ
- డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొన్నంతో కలిసి మీడియా సమావేశం
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం బ్యారేజీల్లో నీరు నిల్వ చేయకుండా పంపుహౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోస్తామంటూ ప్రతిపక్షాలు చెప్పడం శుద్ధ అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘కుంగిపోయిన మేడిగడ్డ, పునాదులు దెబ్బతిన్న అన్నారం, సుందిళ్ల రిజర్వాయర్ల గేట్లు మూయలేం.. గేట్లు తెరిచి పంపులు నడపడం అసాధ్యం’ అని స్పష్టం చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) కూడా ఇదే విషయం చెప్పిందని, టెస్టులు, రిపేర్లు అయ్యేవరకు గేట్లు వేయలేమని సీఎం తేల్చి చెప్పారు.
ఎంసీహెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి శనివారం సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టును సర్వనాశనం చేసి, వేల కోట్ల ప్రజాధనాన్ని ముంచేసిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు రిటైర్డ్ ఇంజినీర్ల ముసుగులో వచ్చి నీటిని ఎత్తిపోయాలంటూ ఉచిత సలహాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదికను పక్కనబెట్టి రాజకీయ లబ్ధి కోసం రైతులను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలిపోవడానికి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలు, హరీశ్ రావు అవినీతి దాహమే కారణమన్నారు. లక్ష కోట్ల ప్రజాధనాన్ని గోదావరి పాల్జేసి, ప్రాజెక్టును శ్మశానంగా మార్చిన మాయల మరాఠీలు ఇప్పుడు తామేదో పత్తి గింజలమన్నట్లు ఫోజులు కొడుతున్నారని మండిపడ్డారు. తిమ్మిని బమ్మిని చేస్తూ, అబద్ధాలతో ప్రజలను నమ్మించాలని చూస్తే బొందపెడతామని హెచ్చరించారు.
ఎత్తిపోయాలంటే కనీస నిల్వలు ఉండాల్సిందే..
మేడిగడ్డ బ్యారేజీ బెడ్ లెవెల్ 89.5 మీటర్లు కాగా, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు కనీసం 93.5 మీటర్ల మేర నీటి నిల్వ ఉండాలని, అంటే బ్యారేజీలో ఐదు టీఎంసీల నీటిని నిల్వ చేయాల్సి ఉంటుందని సీఎం తెలిపారు.
గేట్లు ఓపెన్‌గా ఉంచినప్పుడు నీరు నిలబడదని, నీరు నిలబడకుండా పంపులు నడవడం అసాధ్యమని వివరించారు. కేవలం ట్రయల్ రన్ లేదా డ్రై రన్ కోసం కొద్ది నిమిషాలు నీటిని ఎత్తిపోయవచ్చేమో కానీ, పంటలకు సరిపడా నిరంతరాయంగా నీటిని తోడటం అస్సలు కుదరదని సీఎం సాంకేతిక అంశాలతో సహా తేల్చిచెప్పారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిధిలో కూడా ఇదే విధమైన టెక్నికల్అడ్డంకులు ఉన్నాయని సీఎం వివరించారు.
అన్నారం బ్యారేజీ బెడ్ లెవెల్ 106 మీటర్లు కాగా, సరస్వతి పంప్ హౌస్ పనిచేయాలంటే 116.5 మీటర్ల ఎత్తు వరకు నీరు నిల్వ ఉండాలని, అలాగే సుందిళ్ల బెడ్ లెవెల్ 118 మీటర్లు కాగా, పార్వతి పంప్ హౌస్ కోసం 126.5 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయాలని పేర్కొన్నారు. ఈ మూడు బ్యారేజీల పునాదులు బలహీనపడ్డాయని ఎన్‌డీఎస్‌ఏ చెప్పినందున గేట్లు మూసే పరిస్థితి లేదన్నారు. ఒకవేళ అన్నారం గేట్లు మూయకుండా మేడిగడ్డ నుంచి నీటిని పంప్ చేస్తే, ఆ నీరంతా అన్నారం నుంచి తిరిగి వెనక్కి మేడిగడ్డకే కొట్టుకుపోతుందని, ఇది గానుగ ఎద్దు తిరిగినట్లు వృథా ప్రయాస అవుతుందని సీఎం వివరించారు.
బందిపోట్ల కంటే ప్రమాదకరం
‘‘ప్రాజెక్టును నిలువునా ముంచేసిన దొంగల చేతికి మళ్లీ తాళాలు ఇవ్వడానికి మేమేం అమాయకులం కాదు.. దొంగల చేతికి తాళాలు ఇచ్చే ప్రసక్తే లేదు’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హరీశ్ రావు, కేసీఆర్ ముఠా సాదాసీదా దొంగలు కారని, వారు గజదొంగలని, బందిపోట్ల కంటే ప్రమాదకరమైన దోపిడీదారులని విమర్శించారు. ప్రాజెక్టును కూల్చేసి, వందల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన కిలాడీ కమిటీకి మళ్లీ గేట్ల తాళాలు అప్పగిస్తే ఉన్నది కాస్తా గంగలో కలిసిపోతుందని హెచ్చరించారు.
మూడు నెలల సమయం ఇస్తే హరీశ్ రావు చేసేది రిపేర్లు కాదని, మళ్లీ కాంట్రాక్టర్లను బెదిరించి కమీషన్లు వసూలు చేయడమేనన్నారు. హరీశ్ రావుకు ప్రాజెక్టులపై గానీ, రైతులపై గానీ ఏమాత్రం ప్రేమ లేదని, ఆయన ఆరాటమంతా పాత కమీషన్ల బకాయిల కోసమేనన్నారు. ‘‘హరీశ్ రావు బ్లాక్‌మెయిల్ పాలిటిక్స్‌లో నిష్ణాతుడు. గతంలో చేసిన పనులకు సంబంధించి కొంతమంది కాంట్రాక్టర్లు ఇవ్వాల్సిన కమిషన్లు ఇంకా మిగిలిపోయాయి.
ఇప్పుడు మూడు నెలల పాటు ప్రాజెక్టును చేతికి ఇస్తే, ఆ కాంట్రాక్టర్లను భయపెట్టి, బ్లాక్‌మెయిల్ చేసి, పాత బకాయిలు వసూలు చేసుకుని పారిపోవాలని చూస్తున్నాడు’’ అని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టును ధ్వంసం చేసిన వ్యక్తి, ఇప్పుడు మూడు నెలల్లో బాగు చేస్తాననడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందన్నారు. హరీశ్ రావుకు అంతగా నైపుణ్యం ఉంటే, బినామీల వెనుక దాక్కోకుండా నేరుగా ఎల్అండ్‌టీ దగ్గరకు వెళ్లి అధికారికంగా సబ్-కాంట్రాక్ట్ తీసుకుని పనులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
ఎంపీ ఈటల తీరు సిగ్గుచేటు..
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని సీఎం అన్నారు. ‘‘బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ‘కిలాడీ కమిటీ’తో ఈటల చేతులు కలపడం సిగ్గుచేటు. నిజంగా మీకు రైతులపై ప్రేమ ఉంటే, ఢిల్లీకి వెళ్లి మీ కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రి వద్ద, ఎన్‌డీఎస్‌ఏ అధికారుల వద్ద మాట్లాడి బ్యారేజీలలో తాత్కాలికంగా నీటిని నిల్వ చేసి ఎత్తిపోసేందుకు అనుమతులు తీసుకురండి’’ అని సవాల్ విసిరారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ నిజాయితీపరుడైతే, ఢిల్లీకి వెళ్లి ఎన్‌డీఎస్‌ఏ అధికారులతో మాట్లాడి బ్యారేజీలలో నీటి నిల్వకు అనుమతులు తీసుకురావాలన్నారు.
అనుమతి పత్రాలు తెస్తే ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల పర్యవేక్షణలోనే తాము నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే, కేంద్రం వద్ద మూలుగుతున్న కాళేశ్వరం అవినీతి ఫైళ్లను కదిలించి, సీబీఐ విచారణను వేగవంతం చేయించి కేసీఆర్ కుటుంబ దోపిడీని శిక్షించేలా ఈటల రాజేందర్ ఒత్తిడి తేవాలన్నారు. అంతేకానీ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఇక్కడ చౌకబారు బురద రాజకీయాలు చేయవద్దన్నారు.
జైలు భయంతోనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ కలిసి ‘‘కిలాడీ కమిటీ’’గా ఏర్పడి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్ కూడా బీఆర్ఎస్ నేత హరీశ్ రాసిచ్చిన స్క్రిప్టు ను పట్టుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ బాగోతాన్ని బయటపెట్టకుండా జైలుకు పంపకుండా వదిలేయడమే మేం చేసిన తప్పు. అందుకే ఈరోజు రిటైర్డ్ ఇంజినీర్ల ముసుగులో వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఎవరికీ లొంగదు.. ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ సూచనల ప్రకారమే ప్రతి అడుగూ వేస్తాం. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ బోనులో నిలబెడతాం” అని సీఎం స్పష్టం చేశారు.
ఆంధ్ర కాలేజీల యాజమాన్యాలకుపాలు అమ్ముకుంటున్నడు
‘‘హరీశ్‌రావు ఆంధ్ర కాలేజీల యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేసి, బెదిరించి తన వ్యాపారాలు సాగిస్తున్నాడు. నాడు ఆంధ్రోళ్ల రక్తం తాగుతున్నారని తిట్టిన నోటితోనే, నేడు అదే నారాయణ, చైతన్యల దగ్గర మోచేతి నీళ్లు తాగుతూ పాలు పిండుకుంటున్నాడు. ఇంతకంటే నీచమైన, హీనమైన బతుకు ఇంకేమైనా ఉంటుందా హరీశ్‌రావు?’’ అని సీఎం ప్రశ్నించారు. నాడు ప్రజలను భావోద్వేగాలతో రెచ్చగొట్టి, నేడు అదే దోపిడీదారులతో చేతులు కలిపి వాళ్లకు పాలు అమ్ముతూ రూ.వేల కోట్లు వెనకేసుకున్న హరీశ్‌రావు నైజాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
11 నెలల్లోనే బ్యారేజీలో లోపాలు బయటపడ్డాయి
కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రాజెక్టును ప్రారంభించిన కేవలం 11 నెలల లోపే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో తీవ్రమైన లోపాలు బయటపడ్డాయని సీఎం తెలిపారు. 18 మే 2020 నాడు అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) బి.వి.రమణారెడ్డి బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్అండ్‌టీకి అధికారికంగా ఒక లేఖ రాశారని గుర్తుచేశారు.
ఆ లేఖలో సీసీ బ్లాకులు, వేరింగ్ కోట్ దెబ్బతిన్నాయని, వర్షాకాలం రాకముందే అత్యవసరంగా రిపేర్లు చేయకపోతే బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉందని స్పష్టంగా హెచ్చరించినప్పటికీ, నాటి ప్రభుత్వం ఆ హెచ్చరికలను పూర్తిగా బేఖాతరు చేసిందని సీఎం ఆరోపించారు. ఆనాడే స్పందించి ఉంటే నేడు బ్యారేజీ ఈ దుస్థితికి వచ్చేది కాదన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న లోపాలు, నిర్లక్ష్యానికి కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోవడమే నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
14 జులై 2022 నాడు గోదావరిలో వచ్చిన వరదలకు కన్నెపల్లి, అన్నారం పంప్ హౌస్‌ల సేఫ్టీ వాల్స్ పూర్తిగా బద్ధలై, కన్నెపల్లి పంప్ హౌస్ నీట మునిగిపోయిందన్నారు. ఆ సమయంలో కూడా నష్టాన్ని శాశ్వతంగా నివారించేలా శాస్త్రీయంగా రిపేర్లు చేపట్టలేదని, కేవలం తాత్కాలిక పనులతో సరిపెట్టారని విమర్శించారు. నేటికీ కన్నెపల్లి పంప్ హౌస్ 100 శాతం వినియోగంలోకి తీసుకురావడానికి వీల్లేని విధంగా దెబ్బతిని ఉందన్నారు. అక్టోబర్ 24, 2023 నాడు, అంటే ప్రాజెక్టు ప్రారంభించిన కేవలం నాలుగేళ్లలోనే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయని, ఇది కేసీఆర్ ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట అని సీఎం దుయ్యబట్టారు.
బ్యారేజీ కుంగిపోయిన వెంటనే అక్టోబర్ 22న ఎన్‌డీఎస్‌ఏ కమిటీని నియమించగా, వారు నవంబర్ 1, 2023 నాడు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ప్రాథమిక నివేదిక ఇచ్చారని తెలిపారు. ఆ నివేదికలోనే మేడిగడ్డ నిర్మాణంలో ప్లానింగ్, డిజైనింగ్, కన్‌స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్ వైఫల్యాలు ఉన్నాయని నిపుణులు తేల్చిచెప్పారన్నారు. బ్యారేజీకి ఉన్న సీకెంట్ పైల్స్ ఫౌండేషన్ లోపభూయిష్టంగా ఉందని, ఏ క్షణంలోనైనా బ్యారేజీ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ గేట్లను తెరిచి ఉంచాలని నాడే ఆదేశించారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
పార్లమెంటు ఆమోదించిన డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం దేశంలోని అన్ని బ్యారేజీల భద్రతా బాధ్యతలు, తనిఖీలు ఎన్‌డీఎస్‌ఏ పరిధిలోకి వస్తాయని సీఎం వివరించారు. డ్యామ్ యజమాని అయిన రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఎన్‌డీఎస్‌ఏ ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని, లేనిపక్షంలో క్రిమినల్ చర్యలకు బాధ్యుల వుతారని చట్టం చెబుతోందన్నారు. ఎన్‌డీఎస్‌ఏ w బృందం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వీటిలో నీటిని నిల్వ చేయడం ఎంతమాత్రం సురక్షితం కాదని స్పష్టంగా చెప్పిందన్నారు.
కేసీఆర్ మొహం చెల్లకనే ఫామ్‌హౌస్‌లో దాక్కున్నడు!
ఎనభై వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్ తెలివితేటల వల్లే కాళేశ్వరం కాస్తా కూలేశ్వరంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు నాశనమై దేశవ్యాప్తంగా ఛీత్కారాలు ఎదురవుతుండటంతో కేసీఆర్ మొహం చెల్లక ఫామ్‌హౌస్‌లో దాక్కున్నాడని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, అధికారుల హెచ్చరికలను లెక్కచేయకుండా ప్రాజెక్టును కేవలం దోపిడీ కోసమే కట్టారని ఆరోపించారు.
తాము చేసిన ఘోరమైన పాపాలు బయటపడటంతో సమాధానం చెప్పలేక కేసీఆర్ పారిపోయాడని, ఇప్పుడు కొడుకును, అల్లుడిని జనాల మీదకు వదిలి అబద్ధాల ప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. దోపిడీ దొంగలకు, బందిపోట్లకు ఈ సమాజంలో ఎలాంటి గౌరవం దక్కదని, కేసీఆర్ పాపాలను ప్రజలు ఎన్నటికీ క్షమించరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కమీషన్ల కోసం ఇష్టారాజ్యం: ఉత్తమ్ కుమార్ రెడ్డి.
అప్పటి సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు కమీషన్ల కోసం ప్రాజెక్టు డిజైన్లను ఇష్టారాజ్యంగా మార్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గత కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి, నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టుల వల్లే తెలంగాణ సాగునీటి రంగానికి స్థిరత్వం చేకూరిందన్నారు. కాలేశ్వరం కింద ఒక్క ఎకరాకు కొత్తగా శాశ్వత నీరు ఇవ్వలేకపోయారని, కేవలం అప్పుల భారాన్ని మాత్రమే మిగిల్చారని విమర్శించారు.
ప్రభుత్వం ప్రస్తుతం ఐఐటీ బాంబే నిపుణులతో సమగ్ర టెస్టింగ్ ప్రక్రియను నిర్వహిస్తోందని, ఈ నెల చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఆగస్టు చివరి నాటికి నిపుణుల తుది డిజైన్ల ఆధారంగా అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి, రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు.
ఎత్తిపోయాలంటే ఇవీ లెక్కలు..
మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసుకునే అవకాశమున్నప్పటికీ కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం పంప్చేయడం లేదన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు సీఎం గట్టిగానే కౌంటర్ఇచ్చారు. ఈ మేరకు ఇంజినీరింగ్నిపుణులతో కలిసి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా టెక్నికల్ అంశాలను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరించారు.
ఆ వివరాలు ఇవీ..
మేడిగడ్డ బ్యారేజీ ఎత్తు (ఎఫ్ఆర్ఎల్) 100 మీటర్లు కాగా.. బెడ్ లెవెల్ 89 మీటర్లు. బ్యారేజ్ బ్యాక్ వాటర్ నుంచి నీటిని ఎత్తిపోసేలా 17 పంపులతో కన్నెపల్లి పంప్హౌస్నిర్మించారు. బ్యారేజీలో 93.5 మీటర్ల ఎత్తులో నీళ్లు ప్రవహిస్తే ఆ నీటిని పంపుల ద్వారా ఎత్తిపోసే వీలుంటుంది. అలా జరగాలంటే గేట్లు వేసి నీటిని కనీసం 93.5 మీటర్లు, ఆపైన నిర్వహించాలి. ఒకవేళ ఆ ఎత్తులో నీళ్లు పారుతున్నాయని అనుకున్నా ఎత్తి ఎక్కడ పోయాలన్నది మరో సమస్య.
బీఆర్ఎస్వాళ్లు చెప్పినట్లు ఒకవేళ కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని అన్నారం బ్యారేజీలోకి లిఫ్ట్ చేశామనుకుందాం. ఇక్కడ, అన్నారం బ్యారేజీ ఫుల్ రిజర్వాయర్ లెవెల్119 మీటర్లు కాగా, బెడ్ లెవెల్ 106 మీటర్లు. అదే సమయంలో 12 పంపులున్న అన్నారం పంప్‌హౌస్ దగ్గరి నుంచి నీటిని డ్రా చేయాలంటే నీటి ప్రవాహ ఎత్తు 116.50 మీటర్లు ఉండాలి. అంటే అన్నారం గేట్లు పూర్తిగా మూసేస్తే తప్ప ఇది సాధ్యం కాదు.
సుందిళ్ల బ్యారేజీ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 130 మీటర్లుకాగా.. బెడ్‌లెవెల్ 118.70 మీటర్లు. బ్యారేజీకి ఎగువన 17 పంపులతో నీటిని ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌ను నిర్మించారు. అక్కడ నీటిని లిఫ్ట్ చేయాలంటే కనీస నీటి ప్రవాహ ఎత్తు 126 మీటర్లుండాలి. సుందిళ్ల గేట్లు మూస్తే తప్ప ఇది కూడా సాధ్యం కాదు. కానీ మేడిగడ్డతోపాటు అటు అన్నారం, ఇటు సుందిళ్ల బ్యారేజీల పునాదుల్లో సమస్య ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో నీటిని నిల్వ చేయవద్దని నేషనల్డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్ఏ) స్పష్టంచేసినట్లు సీఎం వివరించారు.
ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోలేం..
కేంద్ర ప్రభుత్వం జూన్ 30, 2024 నాడు కాళేశ్వ రం బ్యారేజీల పునరుద్ధరణ పర్యవేక్షణ కోసం ఒక ఉన్నత స్థాయి టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీ నియమించిందని సీఎం వెల్లడించారు. ఈ కమిటీలో ఎన్‌డీఎస్‌ఏ సాంకేతిక సభ్యుడు చైర్మన్‌గా ఉండగా, సీడబ్ల్యూసీ డిజైన్ల డైరెక్టర్, సీడబ్ల్యూసీ గేట్ల డైరెక్టర్, సీఎస్‌ఎంఆర్‌ఎస్ సీడ బ్ల్యూపీఆర్‌ఎస్ ప్రతినిధులు సభ్యులుగా ఉన్నార ని, తెలంగాణ ప్రభుత్వం తరఫున ముగ్గు రు సీనియర్ ఇంజినీర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నా రని తెలిపారు. ఈ జాతీయ స్థాయి నిపుణుల కమిటీ పర్యవేక్షణలోనే బ్యారేజీల పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హరీశ్ రావును మామ కేసీఆరే నమ్మలేదు
హరీశ్ రావు కేవలం కమీషన్ల కోసమే పనిచేసే ఒక బ్లాక్‌మెయిలర్ అని సీఎం దుయ్యబట్టారు. గతంలో సాగునీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరీశ్‌రావు వ్యాప్కోస్ నివేదికలను పక్కనబెట్టి, షీట్ పైల్స్ ఫౌండేషన్ స్థానంలో సీకెంట్ పైల్స్ ఫౌండేషన్ మార్చడం వల్లే బ్యారేజీల పునాదులు దెబ్బతిన్నాయని ఆరోపించారు. హరీశ్‌రావు అవినీతి బుద్ధి తెలిసే సొంత మామ కేసీఆరే అతన్ని నమ్మలేదని, అందుకే రెండోసారి అధికారంలోకి రాగానే అతని నుంచి సాగునీటి శాఖను లాక్కున్నాడ న్నారు.
కేసీఆర్ అవినీతి లక్కీ నంబర్ 6 శాతం కాగా, హరీశ్ రావుది 3 శాతం, కేటీఆర్‌ది 1 శాతం అని.. ఇలా మొత్తం 10 శాతం కమీషన్ల ను పిండుకున్నారని మండిపడ్డారు. అమెరికాలో చదువుకున్నానని, ఐటీ గిరి గిర తిప్పగలనని చెప్పుకునే కేటీఆర్ తెలివితేటలు కేవలం కమీష న్లు వసూలు చేయడానికే పరిమితమ య్యాయా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కనీస శాస్త్ర సాంకే తిక పరిజ్ఞానం లేకుండా, గేట్లు ఓపెన్ చేసి ఉంచినప్పుడు పంపుల ద్వారా నీటిని ఎలా ఎత్తి పోస్తారో కేటీఆర్ చెప్పాలని నిలదీశారు.
ప్రవా హం ఉన్నప్పుడు నీరు నిలవదని, నీరు నిలవకుం డా పంపులు నడపడం కుదరదని తెలిసినా కేటీఆర్ ప్రజలను మభ్యపెట్టేందుకు బురద రాజకీ యాలు చేస్తున్నాడని విమర్శించా రు. తండ్రి కేసీఆర్ అప్రతిష్టను కప్పిపుచ్చడానికి, హరీశ్ అవినీతిని దాచడానికి కేటీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తు న్నాడని ఎద్దేవా చేశారు. కాళేశ్వ రం నాశనానికి కేటీఆర్ కూడా సమాన భాగస్వా మి అని, ఆయన 1 శాతం కమీషన్ల లెక్కలను త్వరలోనే బయటపెడతామని చెప్పారు
