జమిలి ఎన్నికలు పెద్ద కుట్ర : రేవంత్

జమిలి ఎన్నికలు పెద్ద కుట్ర : రేవంత్
  • ఒక్క పార్టీ చేతిలోనే అధికారం కోసం ఎత్తులు 
  • జమిలిపై కేసీఆర్ ​వైఖరేంటో చెప్పాలని డిమాండ్ 

హైదరాబాద్​, వెలుగు: జమిలి ఎన్నికల వెనుక పెద్ద కుట్ర ఉందని పీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి ఆరోపించారు. ‘‘అధ్యక్ష తరహా ఎన్నికలను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఒక్క పార్టీ చేతిలోనే అధికారం పెట్టుకునేందుకు కుట్రలు పన్నుతున్నది. ఇది దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం” అని అన్నారు. ఆదివారం గాంధీభవన్​లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో అత్యున్నతమైనది రాష్ట్రపతి పదవి. జమిలిపై కమిటీకి చైర్మన్​గా మాజీ రాష్ట్రపతిని నియమించి ఆ పదవికే కళంకం తెచ్చారు. మన దేశం రాష్ట్రాల సమూహం. జమిలి విధానంతో వాటి స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుంది. జమిలి ఎన్నికలకు ఇండియా కూటమి వ్యతిరేకం. అందుకే అధిర్​రంజన్​చౌదరి కమిటీ నుంచి తప్పుకున్నారు” అని చెప్పారు. 

ఓడిపోతామన్న భయంతోనే.. 

వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే మోదీ జమిలి ఎన్నికలను తెరపైకి తెచ్చారని రేవంత్ విమర్శించారు. ‘‘కర్నాటకలో మోదీ గల్లీగల్లీ ప్రచారం చేసినా బీజేపీని అక్కడి ప్రజలు తిరస్కరించారు. త్వరలో ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని సర్వేల్లో తేలింది. తెలంగాణలో గెలుపు అవకాశాలు కాంగ్రెస్​కు 38 శాతం, బీఆర్ఎస్​కు 31 శాతం, బీజేపీకి 28 శాతం ఉందని సీ ఓటర్​ సర్వేలో తేలింది. దీంతో మోదీకి భయం పట్టుకుంది. అందుకే జమిలి ప్రస్తావన తెచ్చారు” అని చెప్పారు. 

‘‘కాంగ్రెస్​ను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతున్నది. దానికి కేసీఆర్​సహకరిస్తున్నారు. జమిలికి మద్దతుగా 2018లోనే కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. బీజేపీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవంటున్న కేసీఆర్.. జమిలి ఎన్నికల విషయంలో తన వైఖరేంటో స్పష్టం చేయాలి” అని డిమాండ్​ చేశారు. దీనిపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. 

బోయలను కేసీఆర్ మోసం చేసిండు.. 

బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తానని మాటిచ్చి, కేసీఆర్ మోసం చేశారని రేవంత్ మండిపడ్డారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ వాల్మీకి బోయలు ఆదివారం రేవంత్, ఉత్తమ్, భట్టికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. ‘‘ఆనాడు బంగళాలు బద్దలు కొట్టి గట్టు భీముడిని ఎమ్మెల్యే చేసి బోయలు తమ పౌరుషాన్ని చూపించారు. బంగళాలను బద్దలు కొట్టాలంటే మరోసారి బోయలకు అవకాశం ఇవ్వాలి. హైకమాండ్ అనుమతితో అవకాశం ఉంటే బోయలకు ఎమ్మెల్యే టికెట్​ఇస్తాం. లేకపోతే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. బోయల విజ్ఞప్తిని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాం” అని చెప్పారు. గద్వాలలో బంగళా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. 

‘‘ఆనాడు నడిగడ్డలో పాదయాత్ర చేస్తే కేసీఆర్​కు బోయలు అండగా నిలబడ్డారు. మహబూబ్​నగర్​కు వలస వచ్చిన కేసీఆర్​ను 2009లో పాలమూరు బిడ్డలు గెలిపించారు. 2014లో బోయ భీముడిని ఎమ్మెల్సీ చేస్తానని కేసీఆర్ మాటిచ్చి తప్పారు” అని ఫైర్ అయ్యారు.