
రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత గాంధీభవన్ దగ్గర ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. నాలుగు కోట్ల మంది ఆకాంక్షల మేరకు పని చేసేందుకు సోనియాగాంధీ తనకు ఈ బాధ్యతను అప్పగించారని తెలిపారు. నలుగురి చేతిలో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు బందీలయ్యారన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛ, స్వయం పాలన లేక పెద్ద దిక్కు లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ద్రోహులు గద్దెనెక్కి ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఎన్‌కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదన్నారు. అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలను టీఆర్ఎస్ పార్టీ ఆదుకోలేదని విమర్శించారు. అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. రాహుల్ గాంధీ వంటి నాయకుడు మన సైన్యాన్ని ముందుండి నడిపిస్తారు తెలిపారు. ప్రశాంత్ కిశోర్‌ను సలహాదారుగా పెట్టుకోవాలని కొందరు సూచిస్తున్నారని.. అయితే .. పాదరసం లాంటి మా కార్యకర్తలే పీకేలన్నారు.
రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండగా... కొందరు కార్యకర్తలు రేవంత్‌కు అనుకూలంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి. సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేస్తున్న కార్యకర్తలను వద్దని వారించారు. వ్యక్తుల పరంగా ఎవరికీ స్లోగన్‌లు వద్దన్నారు. ధిక్కరించిన వారిని అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తానంటూ హెచ్చరించారు. వ్యక్తిగతం వద్దు.. సమష్టిగా పోరాడదామంటూ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత నినాదాలు ఇవ్వడం పార్టీకి తీరని నష్టమన్నారు. పార్టీ సమష్టి పోరాటాలతోనే అధికారం చేజిక్కించుకోగలమన్నారు. అంతేకాదు..ఈ రోజు నుంచి జై సోనియా, జై రాహుల్ గాంధీ నినాదాలు మాత్రమే వినిపించాలన్నారు రేవంత్ రెడ్డి.