నిరుద్యోగుల బాధలు కనపడ్తలేవా?.. కేటీఆర్‌‌‌‌ ట్వీట్‌‌పై రేవంత్‌‌ కామెంట్‌‌

నిరుద్యోగుల బాధలు కనపడ్తలేవా?.. కేటీఆర్‌‌‌‌ ట్వీట్‌‌పై రేవంత్‌‌ కామెంట్‌‌
  • నిరుద్యోగుల బాధలు కనపడ్తలేవా?
  • హిమాన్షును మిస్ అవుతున్నట్టు కేటీఆర్‌‌‌‌ ట్వీట్‌‌పై రేవంత్‌‌ కామెంట్‌‌

హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ హాస్టళ్లలో సరైన తిండి పెట్టకుండా చిన్నారులను ఏడిపించి, ఫీజు బకాయిలివ్వకుండా యువతను గోసపెట్టి, ఉద్యోగాలివ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్‌‌‌‌ఎస్‌‌ సర్కారుకు ఆ బాధితుల తల్లిదండ్రుల శాపం తగిలి తీరుతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం తన కుమారుడు హిమాన్షును మిస్ అవుతున్నానంటూ మంత్రి కేటీఆర్ పెట్టిన ట్వీట్‌‌కు రేవంత్ రిప్లై ఇచ్చారు. నిరుద్యోగ యువత, హాస్టళ్లలో ఉన్న విద్యార్థులతో పోలుస్తూ విమర్శలు గుప్పించారు.

‘‘దూరంగా ఉన్న బిడ్డ గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతున్నదా కేటీఆర్.. కొడుకుతో కొద్ది రోజుల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లుతున్నది కదా.. మరి, ఉద్యోగం కోసం ఏండ్ల తరబడి ఇంటి మొహం చూడని లక్షలాది మంది నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన మీలా కాదా? సర్కారు హాస్టళ్లలో మీరు పెట్టే తిండి తినలేక పిల్లలు ఏడుస్తున్నారని తెలిసి వారి అమ్మానాన్నలు పడే బాధ మీలా కాదా? కొడుకు తిరిగిరాక, పదేండ్లుగా ఏ సాయానికి నోచుకోక కుమిలి కుమిలి ఏడుస్తున్న అమరవీరుడి కుటుంబ యాతన మీలా కాదనుకున్నారా? మీ గ్లోబరీనా కంపెనీ వల్ల చనిపోయిన 30 మంది ఇంటర్ విద్యార్థుల కన్నపేగుల ఆక్రందన మీలా కాదా?’’అంటూ ఫైర్ అయ్యారు. ఆ తల్లిదండ్రుల ఉసురు కేసీఆర్ సర్కారుకు తగిలి తీరుతుందని రేవంత్‌‌ విమర్శించారు.